దొడ్డు వడ్లకూ బోనస్ ప్రకటించాలి
` ఎమ్మెల్యే హరీశ్
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో వరికి చెల్లించే బోనస్ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. సన్నం వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంతో విపక్షాలు దీనిపై విమర్శలకు పదను పెట్టాయి. ఇదే అంశంపై విపక్ష బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడిరది. మేనిఫెస్టోలో వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని ఎమ్మెల్యే హరీశ్ రావు గుర్తుచేశారు. ఇప్పుడు మాట మార్చి సన్న వడ్డకు మాత్రమే ఇస్తాననడం సరికాదని గుర్తుచేశారు. రాష్ట్రంలో కోటి 20 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండుతుంది. అన్నింటికి బోనస్ ఇవ్వాలంటే రూ.6 వేల కోట్ల భారం పడుతుంది. అందుకోసం సన్నం వడ్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని హరీశ్ రావు విమర్శించారు. ఇలా చేస్తే రూ.400 కోట్ల మాత్రమే ఖర్చవుతుందని వివరించారు. యాసంగిలో రైతులు సన్నం వడ్లు పండిరచరని హరీశ్ రావు గుర్తుచేశారు. పండిరచని వడ్లకు బోనస్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బోనస్ ఇవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త కుట్రకు తెరతీసిందని విమర్శింంచారు. రైతు భరోసా కింద ఎకరాకు ప్రభుత్వం రూ.2500 ఇవ్వాల్సి ఉందన్నారు. వానాకాలానికి సంబంధించి ఎకరానికి 15 వేల రైతు భరోసాతోపాటు యాసంగి బకాయిలు కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు. దొడ్డు వడ్లు కొంటారా? కొనరా? కొంటె ఎప్పటి నుంచి కొంటారో చెప్పాలని సూటిగా అడిగారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలి పెట్టమని తేల్చి చెప్పారు. ఇతర పంటల కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వడ్లు కొనడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వం వడ్లు కొనకపోవడం వల్ల రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.