దోమల నివారణకు పూనుకోండి
స్వైన్‌ఫ్లూ లాంటి వ్యాధులపై అవగాహన కల్పించాలి
కామారెడ్డి,నవంబర్27 (జనంసాక్షి) : : చలి పెరుగుతన్నందున స్వైన్‌ఫ్లూ ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు స్వైన్‌ఫ్లూపై అవగాహన కల్పించాలన్నారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు, ఒళ్లు, తల నొప్పి, చలి, త్వరగా అలసిపోయే లక్షణాలు కనిపిస్తాయన్నారు. వ్యాధిని వెంటనే గుర్తించకపోతే మరో వ్యక్తికి సంక్రమించే ప్రమాదం ఉందన్నారు. స్వైన్‌ఫ్లూ సోకిన వారికి మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ మందులతో వ్యాధి పూర్తిగా నయమవుతుందని తెలిపారు. వ్యాధులు రావడం, వచ్చిన తరువాత వైద్యం అందించడం కోసం చర్యలు తీసుకోవడం జరిగేదే. కానీ, వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు దోమల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా వంటి వ్యాధులు దోమకాటుతో వచ్చే వ్యాధులు కావడంతో వ్యాధులు వచ్చిన వారు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా.. ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఏటా డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య జిల్లాలో పెరుగుతున్నది. డెంగీ కారణంగా మృత్యువాత పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాధికి కారణమయ్యే దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.ఇందులో భాగంగా దోమలు పెరగడానికి కారణమయ్యే పరిస్థితులు, అంటే నీరు నిలిచి ఉండకుండా చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగా పాఠశాలల ఆవరణలో ఉన్న నీటితొట్టిలు, పూలకుండీలు, కూలర్లు, నిల్వ ఉన్న వస్తువులు, కాగితాలు తొలగించేలా చర్యలు తీసుకుంటారు. నీటినిల్వ ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు దోమల జీవిత చరిత్రకు సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. పాఠశాలల్లో పది వారాల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. పాఠశాలల్లో దోమల నివారణకు సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పించడంతో ఇంటి వద్ద ఈ కార్యక్రమం అమలయ్యే అవకాశాలు ఉన్నాయి.