దోషులను శిక్షించినప్పుడే సలాం కుటుంబానికి న్యాయం
ప్రభుత్వ తీరులో చిత్తశుద్ద కానరావడం లేదు: ఫరూక్
నంద్యాల,నవంబర్17(జనంసాక్షి): నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని టిడిపి డిమాండ్ చేసింది. ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరగాలని మండలి మాజీ ఛైర్మన్ ఎన్‌ఎండి ఫరూక్ డిమాండ్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని… ఇందులో పోలీసులు కూడా భాగస్వామ్యులుగా ఉండటం బాధాకరమన్నారు. సలాం తన కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవడం కలచి వేస్తుందని తెలిపారు. సెల్ఫీ బయటకు రాకుంటే ఇటువంటి అకృత్యాలు బయటకు వచ్చేది కాదని అన్నారు. ఎవరి ఓట్లతో అయితే జగన్ గెలిచారో వారి పైనే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకుంటున్నారని… తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వాస్తవాలు రావాలంటే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎటువంటి పోరాటానికైనా సిపిఐ మద్దతు ఇస్తుందని రామకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మైనార్టీలపై దాడులను అన్ని పార్టీలు ఖండిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో సలాం ఉదంతం ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిదర్శనమని విమర్శించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించకుండా అన్యాయంగా అతన్ని వేధించారని మండిపడ్డారు. కంచే చేను మేస్తే ..అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ మార్చుకుని ప్రజలకు మేలు చేసేలా వ్యవహరించాలని హితవుపలికారు. టీడీపీ అడ్వకేట్ బెయిల్ వేశారని మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలని ఆగ్రహంవ్యక్తం చేశారు. సలాం ఉదంతంలో వైసీపీ నాయకులు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై ప్రతి ఒక్కరు చలించిపోయారని…కానీ ముఖ్యమంత్రి జగన్‌కు మాత్రం స్పందించే సమయం లేదని విమర్శించారు. దీనిని బట్టి మైనార్టీలపై జగన్‌కు ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతోందన్నారు. ఘటనకు బాధ్యులైన పోలీసులు, పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చిన అధికారపార్టీ నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బెయిలబుల్ సెక్షన్లు పెడితే ఏ కోర్టు అయినా బెయిల్ ఇస్తుందనే ఇంగితం మరిచారా అని ప్రశ్నించారు. మరి అమరావతి ఉద్యమం, సోషల్ విూడియా పోస్టులో బెయిల్ ఎందుకు రాలేదు అని నిలదీశారు. అంటే సెక్షన్‌లు ఏ కేసులో ఎలా పెట్టాలో కూడా తెలియడం లేదా అని మండిపడ్డారు. సలాంపై ఒత్తిడి తేవడానికి వెనక ఉన్న వ్యక్తులు ఎవరో బయట పెట్టాలని… సీబీఐ విచారణ ద్వారానే వాస్తవాలు బయటకు వస్తాయని ఫరూక్ డిమాండ్ చేశారు.