ధాన్యం కొనండి:ఉత్తమ్‌..

హైదరాబాద్‌,డిసెంబరు 29 (జనంసాక్షి):రైతులు పండించిన పంటలను ఇకపై కొనబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వెలువరించేంత వరకు ఆందోళన చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. రైతు వ్యతిరేక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణను ఉత్తమ్‌ ప్రకటించారు. గాంధీభవన్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర పార్టీ నేతలతో కలిసి ఉత్తమ్‌ విూడియాతో మాట్లాడారు. రేపటి నుంచి జనవరి 7 వరకు మండలాల వారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పంటలు కొనుగోలు చేయాలనే డిమాండ్లతో తహసీల్లార్లకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు. జవవరి 11న జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడతామని.. 18న ఒక చోట రాష్ట్రస్థాయి నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరిపి ప్రభుత్వ తీరును ఎండగడతామని చెప్పారు. రుణమాఫీ, పంట నష్టంపై ఎలాంటి చర్చే లేకుండా ముఖ్యమంత్రి వ్యవసాయ సవిూక్ష ఎలా చేస్తున్నారని ఉత్తమ్‌ నిలదీశారు.

వ్యవస్థలు కూల్చే ప్రయత్నంలో ఉన్నారు: భట్టి

”తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన వ్యవస్థలను కూల్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతులకు మద్దతు ధర రాకుండా చేసేందుకు కుట్ర జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యాంగాన్ని చదువుకుంటే మంచిది. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఉండాలి కానీ లాభాల కోసం కాదు. లాభనష్టాలను పరిగణనలోకి తీసుకుంటున్నారంటే.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగడం లేదని స్పష్టమవుతోంది. భాజపా, తెరాస ఒకటేనని మొదటి నుంచీ ప్రజలకు చెబుతూనే ఉన్నాం. దిల్లీకి వెళ్లొచ్చిన తర్వాత కేసీఆర్‌ మాట మార్చారు. సీఎం కేసీఆర్‌ వేసుకున్న ముసుగు తాజా నిర్ణయంతో తొలగిపోయింది” అని వ్యాఖ్యానించారు.