ధాన్యం సేకరణకు అధికారుల ఏర్పాట్లు

మద్దతు ధరలు దక్కేలా చర్యలు

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి సేకరించడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేశామని మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు. త్వరలోనే ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయన్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌కు సంబంధించి 2 లక్షల క్వింటాళ్లపైనే ధాన్యాన్ని సేకరించాలనే లక్ష్యాన్ని aడీఆర్‌డీఏ నిర్ణయించింది. అందుకోసం ఉమ్మడి జిల్లాలో 80 కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. జూరాల ప్రాజెక్టు కింద, నీటి వనరులు లభించిన ప్రాంతాల్లో వరి పంటను రైతులు అధికంగా వేశారని ఆ ప్రాంతంలో ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లా నుంచి అత్యధికంగా వరి పంట ఎక్కువ వస్తోంది. అందుకోసం అక్కడ అత్యధికంగా ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహిళా సంఘాలను గుర్తించి వారికి సలహాలను, సూచనలను అందిస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు, సంఘాలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు కూడా దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. అధికారులు సూచించిన మేరకు తేమలేకుండా ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకునిరావాలన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించినా.. రైతుల వద్ద నుంచి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్‌గా పరిగణిస్తూ సేకరణ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది అన్ని వివరాలను ఇంటర్‌నెట్‌తో అనుసంధానం చేసి మహిళాసంఘాలకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారీ వరి ధాన్యాన్ని సేకరించే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. కష్టించి పండించిన పంటలకు రైతులకు మంచి గిట్టుబాటు ధరను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో రైతులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వమే మహిళా సంఘాల చేత కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. అన్ని ధాన్యం సేకరణ కేంద్రాలకు ఈ సేవలను విస్తరిస్తున్నామని అన్నారు.