ధాన్యం సేకరణలో తొలగని సమస్యలు
కరీంనగర్,అక్టోబర్31(జనంసాక్షి): భారీగా ధాన్యం దిగుబడి రావడంతో సేకరణలో ఇబ్బందులు అదేస్థాయిలో ఉన్నాయి. ధాన్యం రైతులంతా ప్రభుత్వ సంస్థకే విక్రయించనుండటం, అధిక దిగుబడి, తూకం వేసిన బస్తాల రవాణా, గన్నీలకొరత, అకాల వర్షాలు తదితర సమస్యలు వెన్నాడాయి. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయటం, 48 గంటల్లో చెల్లింపులు జరుపుతామని పేర్కొన్నా చాలాచోట్ల ఆలస్యం జరుగుతోంది. ఇప్పటికీ చాలాకేంద్రాల్లో కనీస సదుపాయాలు సమకూరక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊళ్లలోని బీట్లను శాశ్వతం చేసేలా సిమెంట్ గచ్చు, గన్నీలు సామాగ్రి నిల్వకు గదుల నిర్మాణం చేపట్టాలని రైతులు కోరుతున్నారు. వడ్లను ఆరబెట్టే యంత్రాలను, శుభ్రం చేసే యంత్రాలను, టార్ఫాలిన్‌షీట్లను సమకూర్చినట్లయితే ఉపయోగంగా ఉంటుంది. ఇకపోతే గతంలో మాదిరిగా మార్కెట్ యార్డుల్లో, మిల్లుల్లో బస్తాల ఓపెన్ నెట్టింగ్‌ను పరిశీలించాలి. జిల్లాలోని లారీల యజమానులకే బస్తాల రవాణా బాధ్యతలను అప్పగిస్తే సమస్య చాలావరకు పరిష్కారమవుతుంది.తగిన వసతులు లేకపోవడం, ఆరుబయట పడవేసే గట్టలు వర్షాలకు తడవటంతోనూ గన్నీలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. జనపనారతో చేసినవి కావడంతో ఒకటిరెండుసార్లు తడిస్తే గన్నీలు చివికిపోతున్నా వీటిని కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో ఒకటిరెండు సీజన్లకే చెడిపోయి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు భారీగా నష్టం వస్తోంది. హమాలీ ఛార్జీలను అన్ని కేంద్రాల్లో ఒకేలా తీసుకునేలా చర్యలుండాలి. పాత సీజన్లకు చెందిన హమాలీ ఛార్జీల బకాయిలను విడుదల చేయాలి. చాలా కేంద్రాలు మట్టికళ్లాలు కావడంతో అకాల వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. సంఘాల నిర్వాహక మహిళలకు కంప్యూటర్లను అందించగా ఎప్పటికప్పుడు సేకరణ వివరాలను నమోదు చేస్తేనే 48 గంటల్లోపు చెల్లింపులు సాధ్యపడతాయి. రైతులు కేంద్రాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టడంటో స్థల సమస్య ఏర్పడుతోంది. రైతులు కళ్లాలవద్దే ధాన్యాని ఆరబెట్టాలని, తేమతగ్గిన ధాన్యం వరుస క్రమంలో కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికారులు పేర్కొంటున్నా ఈ నిర్ణయాన్ని అన్నిచోట్ల అమలు చేయాల్సి ఉంది.