ధావన్‌ వికెట్‌ విలువేంటో తెలుసుకున్నాడు : వీవీఎస్‌

న్యూఢిల్లీ ,జూన్‌ 24 (జనంసాక్షి) :

భారత క్రికెట్‌లో సరికొత్త ఓపెనింగ్‌ సెన్సేషన్‌ శిఖర్‌ ధావన్‌పై వివిఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. అత్యుత్తమ నైపుణ్యమున్న ఆటగాడిగా కితాబిచ్చాడు. ఎప్పటి నుండో అతన్ని చూస్తున్నానని… ఢిల్లీ , నార్త్‌జోన్‌లకు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడని గుర్తు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా సన్‌రైజర్స్‌కు ఆడిన ధావన్‌ ఎంతో ఆకట్టుకున్నాడని చెప్పాడు. ఆస్టేల్రియాపై మెరుపు ఇన్నింగ్స్‌తో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన ధావన్‌ భారత జట్టు ఓపెనింగ్‌ సమస్య తీర్చినట్టేనని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ముగిసిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో ధావన్‌ అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడడం ఎంతో ఆనందంగా ఉందని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించాడు. తన వికెట్‌ ఎంతటి విలువైందో అతను తెలుసుకున్నాడని చెప్పాడు. ఈ టోర్నీలో ధావన్‌ రెండు సెంచరీలతో కలిపి మొత్తం 363 పరుగులు చేయడం ద్వారా మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ గెలుచుకున్నాడు. అటు ధోనీ సారథ్యంపైనా వివిఎస్‌ ప్రశంసలు కురిపించాడు. స్వదేశంలో వివాదాలు చుట్టుముట్టినా… ఏమాత్రం ఏకాగ్రత కోల్పోకుండా జట్టును విజేతగా నిలపడం అద్భుతమన్నాడు.

ఆద్యంతం జట్టు సమిష్టిగా రాణించడం శుభపరిణామని వివిఎస్‌ చెప్పాడు. ముఖ్యంగా బంతితో జడేజాను చక్కగా వినియోగించుకోవడాన్ని అభినందించాడు.