నకిలీ ఓటర్ల కేంద్రాల వారీగా తయారు చేయాలి
– రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
హైదరాబాద్,నవంబరు 19(జనంసాక్షి): ఓటరు జాబితాలో పేరు ఉండి ప్రస్తుతం ఆ చిరునామాలో లేనివారి వివరాలు అందివ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నకిలీ ఓటర్లు, చనిపోయిన వారి జాబితాలు పోలింగ్ కేంద్రాల వారీగా తయారు చేయాలని ఆదేశించింది. ఇలాంటి ఓటర్లు ఓటు వేసేందుకు వచ్చినపుడు ధ్రువీకరణ పత్రాలు తనిఖీ చేసి.. ఫొటో, అవసరమైతే బయోమెట్రిక్ తీసుకుని ఓటింగ్‌కు అనుమతించాలని స్పష్టం చేసింది. పోలింగ్ అధికారులు పూర్తిస్థాయిలో పత్రాలను తనిఖీ చేసిన తర్వాతే ఓటు వేసేందుకు అనుమతించాలని ఎస్‌ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు గ్రేటర్ ఎన్నికల నియమావళిని జీహెచ్‌ఎంసీ ప్రజా సంబంధాల అధికారి విడుదల చేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలివే..
ప్రభుత్వం భవనాల గోడలపై రాతలు, పోస్టర్లు అంటించడం నిషేధం పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వీలైనంత మేరకు ప్లాస్టిక్ పాలిథిన్‌తో తయారైన పోస్టర్లు, బ్యానర్ల వాడకాన్ని నివారించేందుకు ప్రయత్నించాలి. ఎన్నికల కరపత్రంపై ప్రింటర్, పబ్లిషర్ల పేర్లు, చిరునామా లేకుండా ముద్రించకూడదు. పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసం టీవీ, ఇతర తత్సమాన ప్రసార సాధనాలు వినియోగించడం నిషేధం. లౌడ్ స్పీకర్ల వాడకానికి సంబంధిత పోలీసుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. బహిరంగ సమావేశాలు, రోడ్డు షోల్లో లౌడ్ స్పీకర్లను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య.. ఇతర సందర్భాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే అనుమతి. బహిరంగ సభలు రాత్రి 10 తర్వాత, ఉదయం 6 ముందు నిర్వహించకూడదు. అధికార యంత్రాంగం ద్వారా ఓటర్లకు అధికారిక ఫొటో గుర్తింపు స్లిప్ జారీ చేస్తున్నందున అభ్యర్థులు అనధికార గుర్తింపు స్లిప్పులు ఇవ్వకూడదు.