నకిలీ ధృవపత్రాల జారీ అధికారులపై చర్యలు చేపట్టాలి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 8: నకిలీ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బోగస్‌ ధృవీకరణ పత్రాలతో డిఎస్సీకి దరఖాస్తులు చేసుకుంటూ ఆదివాసి గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆరోపించారు. 2008లో జరిగిన డిఎస్సీలో 31 మంది అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను బోగస్‌విగా గుర్తించిన జిల్లా కలెక్టర్‌ వాటి వివరాలను సంబంధిత మండలాలకు పంపినప్పటికీ అభ్యర్థులపై కానీ జారీ చేసిన తహశీల్దార్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. దీంతో 2012 డిఎస్సీలో మళ్లీ ఆ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం శోచనీయమన్నారు. నకిలీ పత్రాలతో వలస లంబాడీలు ఉద్యోగాలు కొల్లగొడుతుంటేత ఆదివాసీలు అన్యాయానికి గురవుతున్నారన్నారు. ఇటీవల బోథ్‌ ప్రాంతానికి చెందిన శారద అనే ఆదివాసి ఆత్మహత్య చేసుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నకిలీ ధృవీకరణ పత్రాలు కలిగి ఉన్న వారిని, జారీ చేసిన వారిపై చట్టరిత్యా చర్య తీసుకొని ఆదివాసీలకు న్యాయం చేయాలని వెంకటేశ్వరరావు కోరారు.