నకిలీ భూమి పత్రాలను తయారు చేసి స్థలాలు అమ్ముతున్న ముఠా అరెస్ట్.

మల్కాజిగిరి.జనంసాక్షి.అక్టోబర్ 18.
నకిలీ భూమి పత్రాలను తయారు చేసి అమ్ముతున్న ముఠాను హాయత్ నగర్ పోలీసుల సహకారంతో ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.హయత్ నగర్ లోని పసుమాముల గ్రామంలో నివాసం ఉంటున్న నాగార్జున గౌడ్ కు 150 గజాల స్థలం ఉంది.కొన్ని సంవత్సరాలుగా స్థలం ఖాళీగా ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన సందీప్ కుమార్ కంట పడింది.ఖాళీగా ఉన్న స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వేరే వ్యక్తులకు అమ్మి వేశాడు.కొన్ని నెలల తర్వాత యజమాని అయిన నాగార్జున గౌడ్ వచ్చి చూడగా పొజిషన్ లో వేరే వారు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించగా సందీప్ కుమార్ ఇతని స్నేహితులు కాంచనపల్లి అజయ్ కుమార్,నాటి చంద్రశేఖర్,నెమలిపురి తరుణ్ కుమార్,బొమ్మ రామారావు ఒక ముఠాగా ఏర్పడి ఖాళీగా ఉన్న స్థలాలను ఎంచుకుని అంబర్ పేట్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సర్టిఫైడ్ కాపీలు తీసుకొని వాటి ఆధారంగా పాత జ్యూడిషియల్ స్టాంప్ పేపర్లు కొని స్టాంపులు,ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లు తయారుచేసి అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. నకిరేకంటి సందీప్ కుమార్ పై బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో,కంచన పల్లి అజయ్ కుమార్ పై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో పాత కేసులు ఉన్నాయని తెలిపారు.
వీరి నుండి నాలుగు కోట్ల విలువ చేసే నకిలీ డాక్యుమెంట్లు,నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్లు,కలర్ జిరాక్స్ మిషన్లు,ఒక కారు, ల్యాప్టాప్,ప్రింటర్,9 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.