నకిలీ విలేకర్ల హంగామా
పోలీసుల కేసు నమోదు
హైదరాబాద్,డిసెంబర3(జనంసాక్షి ): దవాఖానలో హంగామా చేసి, గొడవకు దిగిన ఐదుగురు నకిలీ రిపోర్టర్లపై మేడ్చల్ జిల్లా కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ప్రకాశ్ కథనం ప్రకారం.. గత నెల 27న శావిూర్‌పేట్ మండలం, ఉద్దేమర్రి గ్రామానికి చెందిన బింగి కేతమ్మకు కడుపు నొప్పి రాగా కీసరలోని నితిన్ దవాఖానకు తీసుకొచ్చారు. డాక్టర్ రాజు ఆపరేషన్ చేయగా గడ్డ పెద్దదిగా ఉండడంతో నగరంలోని యశోద దవాఖానకు తీసుకెళ్లాలని సూచించాడు. ఇంతలోనే జవహర్‌నగర్‌కు చెందిన వంకని మల్లేశ్, అరుణ్‌కుమార్, వేణుగోపాల్‌చారి, రామంజనేయులు, శంకర్‌లు దవాఖానకు వచ్చి జర్నలిస్టులమంటూ హంగామా సృష్టించి, రోగులను ఇబ్బందులకు గురిచేశారు. విషయం తెలుసుకున్న స్థానిక టీవీ రిపోర్టర్ అభినవ్‌గిరి వచ్చి ముందు పేషెంట్ ప్రాణాలను దక్కించుకుందాం అని ఎంత చెప్పినా వారు వినిపించుకోకపోగా గొడవకు దిగారు. రిపోర్టర్ గిరి వచ్చి స్థానిక విలేకరులతో కలిసి ఆమెను వైద్యం కోసం యశోద దవాఖానకు తీసుకెళ్లారు. గిరి ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లేశ్, అరుణ్‌కుమార్, వేణుగోపాల్‌చారి, రామంజనేయులు, శంకర్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా… వారు నకిలీ రిపోర్టర్లని తేలింది. దీంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.