నగరంలో ఎక్కడికక్కడే నిలుస్తున్న ట్రాఫిక్‌ ,సమస్య పరిష్కారంపై ట్రాఫిక్‌ పోలీసుల దృష్టేది?

నగరంలో ట్రాఫిక్‌ జంక్షన్లు దాటేందుకు ఎదురు చూపులు తప్పడం లేదు. ట్రాఫిక్‌తో రోడ్లన్నీ రద్దీగా ఉన్నా, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించేందుకు రోడ్లపై ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం కన్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే, రోజువారీగా చలాన్లు వేయడం, వాటిని వసూలు చేయడమే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసులు పనిచేస్తున్నారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ కంటే, చలాన్లు వసూలు చేసే పనిలోనే ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ట్రై పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ట్రాఫిక్‌ పోలీసులు రోజువారీగా ఎక్కువ సమయం చలాన్ల వసూళ్లకే కేటాయిస్తున్నారు. దీంతోనే ఎక్కడి ట్రాఫిక్‌ అక్కడే జామ్‌ అవుతుంది. పగటి పూటనే కాదు, రాత్రి 11 గంటల వరకు నగరంలో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు మార్గాలను మాత్రం అధికారులు వెతకడం లేదు.

రద్దీ వేళల్లో ఉన్నతాధికారుల నుంచి హోంగార్డు వరకు రోడ్లపై ఉండాల్సి ఉన్నా, పట్టించుకునే వారు లేరు. నిత్యం సెంట్రల్‌, వెస్ట్‌ జోన్‌, సౌత్‌ వెస్ట్‌, నార్త్‌ జోన్లలో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే, ట్రాఫిక్‌ పోలీసులు సరైన ప్రణాళికలు లేకపోవడం, క్షేత్ర స్థాయిలో అధికారుల పరిశీలన కరువవ్వడంతో ఇప్పుడు సౌత్‌వెస్ట్‌, ఈస్ట్‌, సౌత్‌జోన్‌లలో జంక్షన్లు పూర్తిగా ట్రాఫిక్‌ రద్దీతో నిండిపోతున్నాయి. గతంలో చాలా జంక్షన్లు ట్రాఫిక్‌ సాఫీగా వెళ్లేది, నేడు అధికారుల పర్యవేక్షణ కరువవ్వడంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడుతుంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాసబ్‌ ట్యాంక్‌, పంజాగుట్టతో పాటు సైబరాబాద్‌లోని పలు జంక్షన్లు దాటేందుకు నిమిషాల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు.

రోడ్లపైకి బయటకు రాని పరిస్థితి..!

ట్రాఫిక్‌లో కొందరు అధికారులు కార్యాలయాల నుంచి బయటకు రాకుండానే పనిచేస్తున్నారు. కొందరైతే క్షేత్ర స్థాయిలో ఏమి చేయాలి? ఏమి లోపాలున్నాయి? అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఉండటంతో తమ అధికారి అలానే ఉన్నాడు, మమ్మల్ని ఎవరు అడుగుతారనే భావనతో ట్రాఫిక్‌పై దృష్టి కూడా పెట్టడం లేదనే విమర్శలున్నాయి. ఇలా, ట్రాఫిక్‌లో చాలా మంది క్షేత్ర స్థాయిలో ఉంటూ ఎప్పకటిప్పుడు సమస్యలను పరిశీలిస్తూ పనిచేయాల్సి ఉండగా, మననెవరు అడుగుతారు? అనే ధీమాతో రోడ్లపైకి కూడా రాకుండా పనిచేస్తుండటంతో నగర వాసులు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.