తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దాశరథి
` తెలంగాణ రైతాంగ సాయధ పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా మలిచిన మహానుభావుడు
` కవి, దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా సీఎం రేవంత్, కేసీఆర్ తదితరుల నివాళులు
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రైతాంగ సాయధ పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా మలిచి.. నిజాం నిరంకుశ పాలనపై ధిక్కార స్వరం వినిపించిన మహానీయుడు ఉద్యమ వైతాళికుడు, మహాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు గారి శత జయంతి సందర్భంగా తెలంగాణకు, సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిరంకుశ పాలన మీదికి ఎక్కు పెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు అన్నారు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని తెలంగాణ కోసం ఉద్యమించిన దాశరథి చిరస్మరణీయుడని కొనియాడారు. ప్రజల్లో చైతన్యం నింపిన ధిశాలి. తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. అనునిత్యం సమ సమాజం కోసం తపించిన గొప్ప వ్యక్తి దాశరథి అన్నారు. కథలు, నాటికలు, సినిమా పాటల రచనల ద్వారా తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలోనూ విశేషంగా కృషి చేశారన్నారు. తెలుగు సినిమా సాహిత్యంలోను విశిష్ఠ స్థానం సంపాదించారన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో దశారథి రచించిన పద్యాలు, పాటలు ఇప్పటికీ ప్రజలందరికీ ఉత్తేజాన్ని, స్పూర్తిని కలిగిస్తాయన్నారు. దశారథి స్పూర్తితోనే తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలను ప్రజా ప్రభుత్వం ఘనంగా సన్మానించి, చేయూత అందించడం జరిగిందన్నారు. ప్రతి ఏడాది దాశరధి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ప్రకటించే దాశరధి కృష్ణమాచార్య అవార్డు – 2025ను కవి, వ్యాసకర్త అన్నవరం దేవేందర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ’ … అంటూ తెలంగాణ గరిమను, తన సాహిత్యం ద్వారా ప్రపంచానికి చాటిన గొప్ప తెలంగాణ కవి, దాశరథి కృష్ణమాచార్య అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. దాశరథి శత జయంతి సందర్భంగా వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. కవిగా, రచయితగా, తెలంగాణ అస్మితను, తన ప్రాంత ప్రజల కష్టాలను, ప్రపంచానికి వినిపించిన తెలంగాణ గర్వించదగ్గ భూమి పుత్రుడు దాశరథి అని కేసీఆర్ అన్నారు.తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం దాశరథి కృష్ణమాచార్య అని మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కవిగా, రచయితగా.. తన రచనలతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన దాశరథి శతజయంతి సందర్భంగా నివాళులర్పించారు. ‘‘నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షర యుద్ధం సాగించి ధిక్కార స్వరం వినిపించిన వైతాళికుడు. రుద్రవీణ, అగ్నిధార, కవితాపుష్యకం, పునర్నవం, అమృతాభిషేకం, తిమిరంలో సమరం లాంటి సంకలనాలు, అద్భుత కావ్యాలు రచించారు. పీడిత ప్రజల గొంతుకగా జీవించిన దాశరథి తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం. అంతటి మహాకవిని గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం సముచితంగా గౌరవించింది. వారి పేరిట సాహితీ పురస్కారాన్ని ఏర్పాటు చేసి.. జయంతిని అధికారికంగా నిర్వహించింది. ఆ మహనీయుడి రచనలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉంది’’ అని పేర్కొన్నారు.