నగరంలో నేరాలు తగ్గాయి
– గతేడాదితో పోలిస్తే కైర్రేటు తగ్గింది
– నేర పరిశోధనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి
– 874మంది చిన్నారులను కాపాడాం
– నివాసయోగ్య నగరాల్లో హైదరాబాద్ నంబర్ వన్‌గా ఉంది
– హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్
హైదరాబాద్, డిసెంబర్ 26(జనంసాక్షి): హైదరాబాద్ నగరంలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాలు తగ్గాయని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. గురువారం కోఠి ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంజనీ కుమార్.. హైదరాబాద్ కమిషనరేట్‌కు సంబంధించిన వార్షిక నేర వివరాలను వెల్లడించారు. నేరాల పరిశోధనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయని చెప్పారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, షీటీంల ద్వారా వారిలో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నామని సీపీ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది 9శాతం నేరాలు తగ్గాయని ఆయన తెలిపారు. చైన్‌స్నాచింగ్‌లు, కిడ్నాప్ కేసులు తగ్గాయని, చైన్‌స్నాచింగ్ కేసులు 30శాతం తగ్గాయని సీపీ చెప్పారు. 874 మంది చిన్నారులను కాపాడామని అన్నారు. నివాసయోగ్య నగరాల్లో హైదరాబాద్ నంబర్ వన్‌గా ఉందన్నారు. పలు మతాల ఉత్సవాలు, కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయని అన్నారు. హైదరాబాద్ భిన్న సంస్కృతుల నగరం అని సీపీ పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీసులకు ప్రభుత్వం, డీజీపీ నుంచి ప్రశంసలు అందాయని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. ఈ ఏడాది 14వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారని, కైం కేసుల్లో 42శాతం మందికి శిక్ష పడిందన్నారు. రూ.26 కోట్లకుపైగా నగదు సీజ్ చేసి రికార్డు నమోదు చేశామన్నారు. ఆటో మొబైల్ కేసులు 17శాతం పెరిగాయని, వరకట్న కేసులు కూడా పెరిగాయని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో రేప్ కేసులు 2018లో 178 కేసులు నమోదైతే, 2019లో 150 కేసులు నమోదు అయ్యాయని సీపీ పేర్కొన్నారు. ఈ ఏడాది 27,737 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, నిందితుల నుంచి కోర్టు ద్వారా రూ. 8 కోట్ల 32 లక్షలు వసూళ్లు చేశామని అన్నారు. సిటీలో రోడ్డుప్రమాదం కేసులు 2,377 నమోదు కాగా, 261 మంది మరణించారన్నారు. హైదరాబాద్‌లో 122 పెట్రోలింగ్ వాహనాలు, 3 లక్షల 40 వేల సీసీ కెమెరాలు ఉన్నాయని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.