నడి సంద్రంలో రొహింగ్యాల నావలు
హైదరాబాద్,మే 24(జనంసాక్షి):పుట్టిన గడ్డపై మమకారం ఎవ్వరికీ చావదు. చావైనా బతుకైనా పుట్టిన గడ్డపైనే అనుకుంటూ కష్టం వచ్చినా, కన్నీళ్లొచ్చినా కడుపున పెట్టుకుని జీవనం సాగిస్తుంటాం. అది మాన వనైజం. ఉన్న ఊరు కన్న తల్లి కన్నా ఎక్కువ అనే భావన ప్రతి మనిషికి ఉంటుంది. మరి కన్న ఊరిపైనే మమకారం పెంచుకున్న వాళ్లకు ఆ ఊరి ని వదిలి వెళ్లటమంటే నరకంతో సమానం. ఒక్కరు కాదు, ఇద్దరుకాదు, ఒకటో రెండో కుటుంబాలు కాదు, ఏకంగా తమ తెగకు చెందిన వేలాది మందికి అలాంటి పరిస్థితే ఎదురైంది. తమ మాతృదేశం బర్మాలో జా త్యహంకార దాడులను, హింసను తట్టుకోలేక వేలాది మంది రొహింగ్యా తెగకు చెందిన ముస్లింలు పడవల్లో ఇండోనేషియా, మలేషియా దేశాలకు పారిపోతున్నారు. సముద్ర మార్గాన పడవల్లో బయల్దేరిన రొహింగ్యాలు సముద్రం నడిబొడ్డున ఆకలి, దప్పులతో
అలమటిస్తున్నారు. అనారోగ్యం బారిన పడి వైద్యం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. ఆగ్నేయాసియాలో నడిసంద్రంలో అనుక్షణం రోదిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. శరణార్థులంతా ప్రస్థుతం ఇండోనేషియాను సమీపించారు. సహాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. మయన్మార్‌లో అత్యధిక జనాభా బుద్ధిస్టులు ఉండగా రొహింగ్యా తెగకు చెందిన ముస్లింలు దాదాపు 15లక్షల మంది వరకు ఉన్నారు. వీరంతా బర్మాలోని రెఖైన్ స్టేట్‌లో అనాదిగా జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ప్రత్యేక రాజ్యం స్థాపన కోసం రొహింగ్యా తెగకు చెందిన ముస్లింలు ఆందోళన చేస్తున్నారు. 2012 నుంచి ఈ అల్లర్లు తారా స్ధాయికి చేరాయి. సాంప్రదాయ బుద్దిస్టులకు, రొహింగ్యా ముస్లింలకు మధ్య తీవ్ర వర్గ పోరు నెలకొంది. ఈ అల్లర్ల నేపథ్యంలో మయన్మార్‌లోని ముస్లింలందరిపైనా బుద్దిస్టుల దాడులు పెరిగాయి. గత కొంత కాలంగా ఈ అల్లర్లు సద్దుమణకపోవడం, శతాబ్దాలుగా ఇక్కడే నివసిస్త్నున రొహింగ్యా తెగపై భీకర దాడులు జరుగుతుండటంతో తట్టుకోలేక పోతున్న ఆ తెగ వారంతా మూట ముళ్లె సదురుకోని వలస బాట పట్టారు. వీరిలో కొంత మందికి ఇప్పటికే ఇండోనేషియా బాసటగా నిలిచింది. వీళ్లంతా బ్రిటిష్ ఇండియా పాలనలో బెంగాల్ నుంచి ఇక్కడికి వలస వచ్చారని కొందరు చరిత్రకారులు అంటున్నారు.రొహింగ్యా తెగకు చెందిన వారికి అన్ని విభాగాల్లోనూ వివక్షే. ఆ దేశ చట్టాలు వీరి పౌరసత్వాన్ని కూడా రద్దు చేశాయి. వీళ్లకు విద్య, వైద్యం లాంటి మౌళిక విషయాల్లోనూ పరిమితి విధించారు. వీరికి మత స్వేచ్ఛ కూడా లేకుండా ఆ దేశ చట్టాలు రూపొందాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ తెగకు కనీసం ఏదైనా అవరసం ఉండి పక్కూరికి వెళ్లాలన్నా అధికారులకు భారీగా లంచాలు ముట్టచెప్తేకానీ సాధ్యంకాదు.
ఇప్పుడు ఈ తెగకు చెందిన వారంతా కోరుకుంటున్నది ఇవే. తమ పౌరసత్యం మొదలు, ప్రాధమిక హక్కులు, ఓటు హక్కు తమకు కల్పించాలని వీరు పోరాడుతున్నారు. మాతృదేశంలో తమకున్న సర్వస్వం వదులుకుని, నగానట్రా అమ్ముకుని ఇప్పటికే దాదాపు లక్షన్నర మంది ఇండోనేషియాలో ఆశ్రయం పొందారు. వలస వెళ్లేముందు తమ కుటుంబసభ్యులతో మాట్లాడటానికి వీరు ఫోన్ కోసం చెల్లిస్తున్న మొత్తం 2000 అమెరికన్ డాలర్లకు పైగానే. ఇక వలసకు బయల్దేరిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వీరిని తరలిస్తున్న మనుషుల రవాణా స్మగ్లర్లు కొన్ని సందర్భాల్లో నడి సంద్రంలో నీరు, ఆహారం లేకుండా, చివరకు పడవలో సరిపడా ఇందనం కూడా ఉంచకుండా వదిలేస్తున్నారు. దాదాపు 3000 మంది ఇలా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. ప్రస్థుతానికి ఇండోనేషియా, మలేషియా దేశాలు రొహింగ్యా తెగకు చెందిన శరణార్థులకు తాత్కాలిక ఆశ్రయం కల్పిస్తున్నాయి. వీరిని ఆదుకునేందుకు గాంబియాతోపాటు పెద్దన్న అమెరికా కూడా ముందుకొస్తోంది. అయితే ఇంకా ప్రపంచ దేశాలు స్పందించాల్సిన అవసరం ఉంది.
తమ దేశంలో జాత్యహంకార దాడులను భరించలేక మనుషుల అక్రమ రవాణా చేసే ముఠాల కాళ్లా వేళ్లా పడి పొరుగు దేశాల్లో బతుకుదామని వెళ్తున్న వారికి నడి సంద్రంలోకెళ్లాక చుక్కలు కనిపిస్తున్నాయి. మంది ఎక్కువై పొరుగుదేశాలు రానివ్వకపోతుండటంతో నడి సంద్రంలో గాలివానలో చిక్కుకుని బిక్కుబిక్కున కాలం వెళ్లదీస్తున్నారు. వీళ్లకు ప్రపంచ దేశాలు ఆపన్న హస్తం అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ముస్లిం తెగకు చెందిన రొహింగ్యాల పట్ల గల్ఫ్ దేశాలు సానుభూతి చూపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సముద్రంలో చిక్కుకున్న వారిని ఆదుకోవటానికి మలేషియా హెలికాప్టర్‌తో పాటు ఆహారాన్ని,నీళ్లనూ సరఫరా చేసేందుకు నాలుగు షిప్పులను ఏర్పాటు చేసింది. మయన్మార్ ప్రభుత్వం రొహింగ్యాల పట్ల అనుసరిస్తున్న వైఖరిని ప్రపంచ దేశాలన్నీ తప్పు పడుతున్నాయి. ఆఫ్రికాలోని అతిచిన్న దేశం గాంబియా కూడా వీరికి ఆశ్రయం కల్పించేందుకు సిద్ధమైందంటే మిగతా దేశాలు స్పందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పటికే ముస్లిం దేశమైన మలేషియాలో చిన్నాచితకా ఉద్యోగాలు దొరికితే బతుకు వెళ్లదీయెచ్చని ఎక్కువమంది మలేషియా బాట పట్టారు. అయితే వలసలు ఎక్కువవుతుండటంతో మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా తదితర దేశాలు వీరికి ఆశ్రయం కల్పించేందుకు నిరాకరిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రొహింగ్యాల సమస్యను పరిష్కరించటానికి మూల కారణాలను విశ్లేషించి ఆసియా దేశాలు పరిష్కార మార్గాలు వెతికితే బాగుంటుంది.