నన్ను బేటీ అని పిలిచేవారు

– తాను మరోసారి తండ్రిని కోల్పోయానని బాధపడ్డా
– ప్రముఖ గాయని లతామంగేష్కర్‌
న్యూఢిల్లీ, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : మాజీ ప్రధాని, రాజకీయ భీష్ముడు అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మరణం పట్ల ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆయన తన తండ్రిలాంటి వారని, తాను మరోసారి తండ్రిని కోల్పోయానని బాధపడ్డారు. లత వాజ్‌పేయీతో సన్నిహితంగా ఉండేవారు. ‘ఆయన నా తండ్రిలాంటి వారు. ఆయన నన్ను బేటీ అని పిలిచేవారు. నేను ఆయనను దాదా అనేదాన్ని, నా తండ్రిని మరోసారి కోల్పోయినట్లు అనిపిస్తుందని అన్నారు. ఆయన ముఖంలో తేజస్సు, వాక్చాతుర్యం, కళల పట్ల ప్రేమ చూస్తే నాకు నా తండ్రి (లత తండ్రి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు పండిట్‌ దీననాథ్‌ మంగేష్కర్‌) గుర్తుకొచ్చేవారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయనను ప్రశంసించేందుకు మాటలు సరిపోవు’ అని లతా మంగేష్కర్‌ అన్నారు. 88ఏళ్ల లతామంగేష్కర్‌ వాజ్‌పేయీతో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. పుణెలో తాము ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానించగా ఆయన వచ్చారని అద్భుతమైన ప్రసంగం చేశారని చెప్పారు. ఆయనలాంటి వక్త భారత రాజకీయాల్లో మరెవ్వరూ లేరని అన్నారు. 2014లో లత వాజ్‌పేయీ గీతాలను ఆల్బమ్‌గా రూపొందించారన్నారు. అటల్‌ జీ హృదయం రీత్యా కవి అని, స్వభావం రీత్యా సాధువు అని లతా ప్రశంసించారు. పాకిస్థాన్‌తో సంబంధాలు మెరుగుపరిచేందుకు ఎంతగా కృషి చేశారో తనకు గుర్తుందని పేర్కొన్నారు. పాక్‌కు బస్సు సర్వీసు ప్రారంభించారని గుర్తుచేశారు.