నర్మదా అవతరణ్ ప్రాజెక్టు ప్రారంభం
– నీటిని విడుదల చేసిన ప్రధాని మోదీ
అహ్మదాబాద్,ఆగస్టు 30(జనంసాక్షి): నర్మదా నదిపై సౌరాష్ట్ర నర్మదా అవతరణ్ ప్రాజెక్టు తొలి ఫేజ్ -2ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. దీనివల్ల గుజరాత్‌లోని రాజ్‌కోట్, జామ్‌నగర్, మోర్బీలోని 10 డామ్‌లకు నీళ్లు అందుతాయి. 2012లో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల సర్దార్ సరోవర్ డ్యామ్ నుంచి వరద నీటిని వేరే ప్రాజెక్టులకు మళ్లించనున్నారు. 4 లక్షల 13 వేల హెక్టార్లకు సౌ రాష్ట్ర నర్మదా అవతరణ ప్రాజెక్టువల్ల నీరందుతుంది. ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నరేంద్ర మోదీ తొలిసారి సొంత రాష్ట్రం గుజరాత్‌లో బహిరంగసభలో పాల్గొన్నారు. సభకు మోదీ రాజకీయంగా కీలకమైన, పటేళ్ల ప్రభావం అధికంగా ఉన్న సౌరాష్ట్ర ప్రాంతాన్ని ఎంచుకున్నారు. సౌని పథకం కింద ఆజి-3 డ్యామ్ ప్రారంభించిన అనంతరం మోదీ బహిరంగ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పంట బీమా సహా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. భవిష్యత్తు తరాల కోసం నీటిని జాగ్రత్తగా కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. నీరు సక్రమంగా అందించగలిగితే రైతులు అద్భుతాలు సృష్టిస్తారన్నారు. మోదీ జామ్‌నగర్‌లోని విమానాశ్రయం నుంచి ప్రాజెక్టు ప్రారంభించడానికి హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆయన రోడ్డు మార్గంలో వెళ్లారు. సౌరాష్ట్ర నర్మద అవతరణ్ ఇరిగేషన్(సౌని) పథకం కింద సనోసరా గ్రామంలోని ఆజి-3 ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు గుజరాత్ ప్రజలకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానని మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాజ్‌కోట్, జామ్‌నగర్, మోర్బి ప్రాంతాల్లోని 10 డ్యామ్‌లు, రిజర్వాయర్లకు నర్మద నీళ్లు చేరతాయి. సౌని యోజన కింద కరవు ప్రాంతమైన సౌరాష్ట్రలోని 115 డ్యామ్‌లను నర్మద నది వరద నీటితో నింపాలని ప్రయత్నిస్తున్నారు. ఇదిలావుంటే ప్రధాని నరేంద్ర మోదీ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పలువురు విూడియా ప్రతినిధులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ వెల్లడించారు. మంగళవారం గుజరాత్ పర్యటనలో భాగంగా మోదీ ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. జామ్‌నగర్‌లో విూట నొక్కి డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసిన తర్వాత అక్కడి ప్రకృతిని చూస్తూ మోదీ నిల్చున్నారు. అయితే అప్పటికే డ్యామ్‌కి కాస్త దూరంలో కింద నిలబడి ఫొటోలు తీస్తున్న జర్నలిస్ట్‌లు వేగంగా వస్తున్న నీటి ప్రవాహాన్ని గమనించలేదు. ఆ ఫొటోగ్రాఫర్లను గమనించిన మోదీ చప్పట్లు కొడుతూ, చేతులు ఊపుతూ వారిని అప్రమత్తం చేశారు. దీంతో సమయానికి వాళ్లు అక్కడి నుంచి తప్పుకున్నారు. ప్రధాని సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని నితిన్ పటేల్ తెలిపారు.