నల్లగొండ జిల్లా ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం అనుమతి

హైదరాబాద్‌,డిసెంబరు 6(జనంసాక్షి): నల్లగొండ జిల్లాకు మహర్దశ. జిల్లా పరిధిలోని ఆయా ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నదిపై కేశావపురం వద్ద కొండ్రపోల్‌ ఎత్తిపోతల పథకానికి పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం.. దాని నిర్మాణానికి 75.93 కోట్లు కేటాయించింది. ఈ ఎత్తిపోతల కింద 5,875 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. నాగార్జున సాగర్‌ ఫోర్‌ షోర్‌పై నెల్లికల్‌ ఎత్తిపోతలకు అనుమతి ఇచ్చారు. 4,175 ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా రూ. 72.16 కోట్ల వ్యయంతో ఈ ఎత్తిపోతలకు అనుమతి ఇచ్చింది. చిట్యాల వద్ద బల్నేపల్లి – చంప్లాతండా ఎత్తిపోతల ప్రాజెక్టును రూ. 219.90 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. వాడపల్లి ఎత్తిపోతల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం.. రూ. 229.25 కోట్ల వ్యయంతో నిర్మించనుంది. ఏఎంఆర్పీ ప్రాజెక్టు యొక్క హై లెవన్‌ కెనాల్‌, లో లెవల్‌ కెనాల్‌ పునరుద్ధరణకు రూ. 247.57 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది.