నష్టాల్లో దేశియ మార్కెట్లు

ముంబయి, జూన్‌25(జ‌నం సాక్షి ): సోమవారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు స్వల్ప లాభనష్టాల మధ్య కదలాడాయి. తర్వాత నష్టాల్లోకి వెళ్లిపోయాయి. బ్యాంకింగ్‌, ఫార్మా, లోహ రంగ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ఉదయం ఐసీఐసీ బ్యాంకు షేర్లు రెండు శాతం పడిపోయాయి. చివరి గంటలో మార్కెట్లు ఎక్కువగా నష్టపోయాయి. ఉదయం సెన్సెక్స్‌ 17.18 పాయింట్ల నష్టంతో 35672.42 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 8.20 పాయింట్ల నష్టంతో 10813.70 పాయింట్ల వద్ద మొదలైంది. చివరకు సెన్సెక్స్‌ 219 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 10,800 మార్కు దిగువకు చేరింది. సెన్సెక్స్‌ 219.25 పాయింట్ల నష్టంతో 35,470.35 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 59.40 పాయింట్ల నష్టంతో 10,762.45 పాయింట్లకు చేరింది. నేటి ట్రేడింగ్‌లో అల్టాట్రెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ్గ/నాన్స్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, ఇన్ఫోసిస్‌, లుపిన్‌ తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. ఐడియా సెల్యూలార్‌, టాటా మోటార్స్‌, హెచ్‌పీసీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంకు, బీపీసీఎల్‌ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.09 వద్ద ట్రేడవుతోంది.