నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబాయి, జులై2(జ‌నం సాక్షి ) : ప్రపంచ మార్కెట్లను వాణిజ్య భయాలు వొదలట్లేదు. ఈనెల 6 నుంచి చైనా వస్తువులపై అమెరికా వాణిజ్య ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్యే గాక… యూరో, అమెరికాల మధ్య కూడా వాణిజ్య గొడవలు ముదిరే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు భయపడుతున్నాయి. శుక్రవారం నామమాత్ర లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు సోమవారం కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఫ్యూచర్స్‌ సూచీలు అరశాతంపైగా నష్టాలతో ట్రేడయ్యాయి. ఆసియా భారీ నష్టాల్లో ముగియగా, యూరోలో షేర్ల పతనం కొనసాగింది. ఇక మన మార్కెట్ల విషయానికొస్తే.. ఉదయం ఆరంభం నుంచి మార్కెట్‌ నష్టాల్లోనే కొనసాగింది. కొద్దిసేపు బలపడినట్లు కనిపించినా… వెంటనే  వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు అరశాతంపైగా నష్టపోయాయి. నిఫ్టి 57 పాయింట్లు క్షీణించి 10,657 వద్ద ముగిసింది.  నిఫ్టిలో 34 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి షేర్లలో ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌ రెండు శాతం లాభపడగా, టైటాన్‌, యూపీఎల్‌, బజాజ్‌ ఆటో నామ మాత్రపు లాభాల్లో ముగిశాయి. ఇక నష్టపోయిన షేర్లు భారీగా పతనయమయ్యాయి. భారతీ ఎయిర్‌టెల్‌ మూడున్నర శాతం నష్టపోగా, ఎన్‌టీపీసీ, హిందాల్కోలు కూడా మూడు శాతం మేరకు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ కూడా రెండున్నర శాతంపైగా నష్టంతో ముగిశాయి. సోమవారం రూ. 190 వద్ద లిస్టయిన రైట్స్‌ షేర్‌ క్రమంగా బలపడి 11 శాతం లాభంతో ముగిసింది.