నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి న్యూస్

సిపిఎస్ విధానం రద్దు అయేవరకు పోరాటం తప్పదు.
జిల్లా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 1(జనంసాక్షి):
ఉపాధ్యాయ ఉద్యోగుల భవిష్యత్ ను తీవ్ర సంక్షోభం లోకి నెట్టివేస్తున్న సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ( యుఎస్ పిసి) డిమాండ్ చేసింది.సెప్టెంబర్ 1 ని పెన్షన్ విద్రోహ దినంగా పరిగణిస్తూ ఉపాధ్యాయులందరూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సాయంత్రం 4.40 గంటలకు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిరసన నిర్వహించి జిల్లా కలెక్టర్ కు మెమోరాండం సమర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ( యుఎస్ పిసి) స్టీరింగ్ నాయకులు టియస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం.శ్రీధర్ శర్మ మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు ఆదేశిత పెన్షన్‌ సంస్కరణల్లో భాగంగా అప్పటి ప్రధాన మంత్రి దివంగత ఎ.బి.వాజ్‌పాయ్ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2004 జనవరి 1 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఫైన్డ్‌ పెన్షన్‌ స్థానంలో కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పధకంను పార్లమెంటు ఆమోదం లేకుండానే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా ప్రవేశపెట్టింది. తదుపరి అధికారంలోకి వచ్చిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ – I ప్రభుత్వం సూచన మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2004 సెప్టెంబర్‌1 తర్వాత నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు డిఫైన్డ్‌ పెన్షన్‌ (పాతపెన్షన్‌) రద్దు చేస్తూ నూతన పెన్షన్‌ (డిఫైన్డ్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌) విధానాన్ని ఏకపక్షంగా అమలు జరుపుతున్నారు. ఈ విధానం ఉద్యోగులకు నష్టదాయకమని, రద్దు చేయాలని ఉపాధ్యాయ, ఉద్యోగులు అప్పటినుండి ఆందోళన చేస్తున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.2014 ఫిబ్రవరిలో పిఎఫ్ఆర్డిఎ చట్టంగా మారిందని, అయినప్పటికీ సిపిఎస్ విధానం అడాప్ట్ చేసుకోవాలా లేదా అనే విచక్షణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉన్నది. కానీ కొత్త రాష్ట్రం తెలంగాణలో పాత పెన్షన్‌ను కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా 2014లో సిపియస్‌నే అమలు జరుపుతామంటూ పిఎఫ్‌ఆర్‌డిఏతో ఒప్పందం కుదుర్చుకున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం (2022 మే 31నాటికి) లక్షా పదమూడు వేల ఆరువందల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిపియస్‌ పథకంలో ఉన్నారు. ఈ పథకం వర్తించేవారు రిటైరైతే అతి తక్కువ మొత్తం పెన్షన్ గా అందుతున్నది.  చనిపోయిన వారి కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ అవకాశం ఇచ్చినప్పటికీ ఉద్యోగి మరణించేనాటికి తన ప్రాన్ ఖాతాలో నిల్వ ఉన్న మొత్తాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేయాలనే షరతు విధించారు. అందువల్ల ఉపాధ్యాయులు, ఉద్యోగులలో వారి కుటుంబాల సామాజిక భద్రత పట్ల తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయి. కనుక సిపియస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జె.రామస్వామి మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాలలో పోరాటాలు నిర్వహిస్తున్నారని కాని ఇప్పటివరకూ  ఈ సమస్య కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం దాటవేస్తున్నది. కాగా ఇటీవల రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించి ఆయా రాష్ట్రాల ఉద్యోగుల మన్ననలు పొందినవి. కనుక తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం కూడా సిపిఎస్ ను రద్దు చేసి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలవాలని కోరుతున్నాము. తదనంతరం పిఎఫ్ఆర్డిఎ రద్దు కోసం కేంద్ర ప్రభుత్వంపై జరిపే దేశవ్యాప్త పోరాటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే నాయకత్వం వహించాలని కూడా కోరుకుంటున్నామని వారు తెలిపారు. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆకాంక్షను గమనించి, ఆందోళనను అర్థం చేసుకుని సిపిఎస్‌ ను రద్దు చేసి, పాత పెన్షన్‌ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రదర్శనలో టియస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి.వహీద్ ఖాన్, డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ టియస్ యుటిఎఫ్ రాష్ట్రకమిటీ సభ్యులు ఎ.చిన్నయ్య గోవర్దన్ శోభన్ బాబు తిరుపతయ్య చంద్రయ్య శేషగిరి రామకృష్ణ శంకర్ మరియు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.