నాదల్‌కు షాక్‌


– డార్కిస్‌ సంచలనం

– వింబుల్డన్‌ రెండో రౌండ్లో ఫెదరర్‌, షరపోవా

లండన్‌ : వింబుల్డస్‌లో తొలి రోజే పెను సంచలనం. మట్టికోర్టు మహారాజుకు షాక్‌! రొలాండ్‌గారోస్‌లో రొకార్డు స్థాయిలో ఎనిమిదో టైటిల్‌ కొట్టి, జోరుమీదన్న రఫెల్‌ నాదల్‌ (స్పెయిస్‌) పచ్చికపై బోల్తా కొట్టాడు. సింగిల్స్‌ తొలి రౌండ్లో అనామక ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా పరాజయంపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. సోమవారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో బెల్జియంకు చెందిన ప్రపంచ 135వ ర్యాంకు ఆటగాడు జర్నీమాస్‌ డార్కిస్‌ 7-6 (7-4), 7-6 (10-8), 6-4తో నాదల్‌పై సంచలనం సృష్టించాడు. వింబుల్డన్‌ చరిత్రలో అత్యంత అవమానకర ఓటముల్లో ఇదొకటి. గ్రాండ్‌స్లామ్‌లో తొలి రౌండ్లోనే ఓడడం నాదల్‌కు ఇదే తొలిసారి. నిరుడు ఇక్కడ అతడికి రెండో రౌండ్లో షాక్‌ తగిలింది. ”శక్తివంచన లేకుండా ప్రయత్నించా. కానీ సాధ్యం కాలేదు. టోర్నీకి ముందు పచ్చికపై ఆడకుంటే వింబుల్డన్‌లో పరిస్థితులకు సర్దుకుపోవడం చాలా కష్టం. విజయానికి డార్కిస్‌ అర్హుడే” అని మ్యాచ్‌ అనంతరం నాదల్‌ వ్యాఖ్యానించాడు. షార్క్‌ అనే ముద్దు పేరున్న 29 ఏళ్ల డార్కిస్‌, ఈ ఏడాదిలో రెండో విజయాలతో వింబుల్డస్‌లో అడుగుపెట్టాడు. ”నేడు గెలుస్తామని ఎవరూ హించలేదు. ఏం చెప్పాలో తెలియట్లేదు.

చాలా సంతోషంగా ఉంది” అని అన్నాడు. డార్కిస్‌ 13 ఏస్‌లు సంధించగా.. నాదల్‌ ఆరు ఏస్‌లో కొట్టాడు. ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌) శుభారంభం చేశాడు. సోంగా (ఫ్రాన్స్‌), సిలిక్‌ (క్రొయేషియా) కూడా బోణీ కొట్టారు. సోంగా 7-6 (7-4), 6-4, 6-3తో గొఫిస్‌ (బెల్జియం) ను ఓడించగా.. సిలిక్‌ 6-3, 6-4తో బగ్దాటిస్‌ (సైప్రస్‌) పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ అజరెంక (బెలారస్‌), మూడో సీడ్‌ షరపోవా (రష్యా) రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. తొలి రౌండ్లో అజరెంక 6-1, 6-2తో కొహియర్‌(పోర్చుగల్‌) ను చిత్తు చేసింది.