నామినేషన్ వేసిన బీగాల
భారీ మెజార్టీతో గెలిపించాలన్న కవిత
నిజామాబాద్,నవంబర్15(జనంసాక్షి): నిజామాబాద్ అర్భన్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బిగాల గణెళిశ్ గుప్తా నామినేషన్ దాఖలు చేశారు. గణెళిశ్ గుప్తా నామినేషన్ కార్యక్రమంలో ఎంపీ కవిత పాల్గొన్నారు. గులాబీ ప్రచారరథం అంబాసిడర్‌ను ఎంపీ కవిత స్వయంగా నడుపుతూ గణెళిశ్ గుప్త నామినేషన్ కార్యక్రమానికి తీసుకువెళ్లారు. జిల్లాలో మళ్లీ క్లీన్ స్వీప్ చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విపక్ష పార్టీలు కొన్ని కలిసి ఏర్పాటు చేసుకున్నది ప్రజాకూటమి కాదని, ఆ కూటమికి ప్రజల మద్దతు లేనందున ప్రజల్లేని కూటమి అని కవిత విమర్శించారు. కూటమి కుట్రలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబునాయుడుతో జతకట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కాంగ్రెస్ ముందు ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉండే వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. గణెళిశ్ గుప్తాను మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తమ అభ్యర్ధులు రెండు సార్లు నియోజక వర్గాలను చుట్టేశారని తెలిపారు. కూటమిలోని పార్టీలు చర్చల విూద చర్చలు జరుపుతూ అభ్యర్ధులను ప్రకటించడానికి ఆపసోపాలు పడుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ద్రోహం చేసిన టీడీపీ కాంగ్రెస్ తో
పొత్తు పెట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే టీడీపీకి వేసినట్లేనన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ఎటువంటి అభివృద్ధి చేశారో అందరికి తెలుసు అని చురకలంటించారు. ఎవరెన్ని కూటములు కట్టినా త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేని అన్నారు.