నారాయణ గోవిందో… గోవిందా..!
– ముందే చెప్పిన ‘జనంసాక్షి’
– అనుమతి లేకుండా నారాయణ స్కూల్ పేరుతో అడ్మిషన్లు
– సీబీఎస్ఈ సిలబస్ అంటూ తల్లిదండ్రులకు కుచ్చుటోపీ
…………………………
మణుగూరు, జూన్ 25, (జనంసాక్షి) : దినదినాభివృద్ధి చెందుతున్న మణుగూరులో విద్య ప్రధాన వ్యాపార కేంద్రంగా మారింది. అందినకాడికి దండుకునేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల మణుగూరులో ఓ ప్రైవేట్ స్కూల్ అనుమతి రాకుండానే ప్రజలను మభ్యపెడుతూ… పాఠశాల ప్రారంభిస్తున్నామని చెబుతూ… మణుగూరులోని అన్ని స్కూళ్లలో విద్యాబుద్ధులు బోధించే మహిళా టీచర్లను ఎరగా వేసి అనుమతి లేకుండానే నారాయణ స్కూల్ పేరు చెప్పి అడ్మిషన్లు చేశారు. అంతటితో ఆగకుండా అడ్మిషన్లకు వేలకు వేలు వసూళ్లు చేశారు. తమది సీబీఎస్ఈ సిలబస్, పెద్ద స్కూల్, కార్పొరేట్ స్థాయి క్యాంపస్ అంటూ నమ్మబలికి మణుగూరులోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలను చూపి ఆఖరికి తల్లిదండ్రులకు కుచ్చుటోపీ పెట్టారు. దీనిపై గతంలో జనంసాక్షిలో ‘అను’మతి’ లేని అడ్మిషన్లు’ కథనం ద్వారా ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేసింది. అయినా స్థానిక విద్యాశాఖాధికారి తమకు కంప్లైంట్ రాలేదంటూ దాటవేసే ప్రయత్నం చేసి పట్టించుకోలేదు. అయితే ఓ ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ ఒత్తిడి మేరకు అన్ని తెలిసినా తెలియనట్లున్నారని మండల విద్యాశాఖాధికారిపై అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తినా తనిఖీలు చేయలేదని తెలుస్తోంది. అనుమతి లేకుండా పాఠశాలకు అడ్మిషన్లు చేసిన కొందరు వ్యక్తులు దాదాపు రెండు వందల మందికి పైగా అడ్మిషన్లు చేసి వారి నుంచి డబ్బులు తీసుకున్నారని తెలుస్తోంది.
లక్షల్లో వసూళ్లు…..
2022 సంవత్సరంలో పాఠశాల ప్రారంభించాలంటే… 2021 సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విద్యాశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. కానీ అలాంటివేవీ లేకుండానే ఓ ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ కు ఉన్న అధికార బలంతో డిగ్రీ కళాశాలను అనుమతి లేకుండా నారాయణ పేరుతో ప్రైవేట్ స్కూల్ గా మార్చేందుకు రూపకల్పన చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ విషయంపై మిగతా ప్రైవేట్ స్కూళ్లు నోరెత్తకుండా సీనియర్ నవ సమాజ స్థాపకులను వినియోగించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎండాకాలం సెలవుల్లో ఖాళీగా ఉండే మిగతా పాఠశాలలకు చెందిన ట్యూటర్లు, టీచర్లను క్యాంపెయినింగ్ కు వినియోగించి వారు పనిచేసిన స్కూల్ విద్యార్థులను టార్గెట్ చేసి తాము రూపకల్పన చేసిన నారాయణ స్కూల్లో చేర్పిస్తే జీతాలిస్తామని నమ్మబలికి అడ్మిషన్లు చేయించుకున్నట్లు సమాచారం. రెండు నెలల వ్యవధిలో 50 అడ్మిషన్లకు 20వేలు జీతం, అలా కాకపోతే నెలకు 13వేలు జీతం అని చెప్పి అడ్మిషన్లు చేయించారు. డిగ్రీ కళాశాలను పాఠశాలగా మార్చేందుకు అనుమతి రాదని తెలియని సదరు టీచర్లు కష్టపడి ఏకంగా ఇతర పాఠశాలల విద్యార్థులను అడ్మిషన్లు చేయించారు. ఒక్కో అడ్మిషన్ కి 3వేలకు పైగా వసూలు చేశారు. సీన్ కట్ చేస్తే… విద్యాసంవత్సరం ప్రారంభమైనా నేటికీ తరగతులు ప్రారంభం కాకపోవడంతో పీఆర్ఓలను నమ్మి అడ్మిషన్లు పొంది డబ్బులు కట్టిన తల్లిదండ్రుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న తీరుగా మారింది. కట్టిన అడ్మిషన్ పోయి గతంలో చేరిన పాఠశాలలో అడ్మిషన్ దొరుకుతుందో లేదో అని ఆగమాగమైతున్నారు.
Attachments area
|