నాలాపన్నులు చెల్లించకుండానే లేఔట్లు?

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
మహబూబ్‌నగర్‌,మే14(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలోని స్థిరాస్తి వ్యాపారులు  నాలా పన్నును చెల్లించకుండానే వ్యవసాయ భూముల్లో లే-అవుట్‌లు చేసి వ్యవసాయేతర భూములుగా మార్చుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ విషయం రెవెన్యూ, నగర పంచాయతీ అధికారులకు తెలిసినా మిన్నకుండిపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా స్థిరాస్తి వ్యాపారులు భూముల విక్రయాల పేరిట దండిగా లాభాలను ఆర్జిస్తున్నారు. తక్కువ ధరకే ఇంటి స్థలాలను విక్రయిస్తామంటూ స్థిరాస్తి వ్యాపారులు పట్టణ, గ్రావిూణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో మధ్య తరగతి ప్రజలు వీరి ప్రచారంలో పడి మోసపోతున్నారు. వీరి అవసరాలను ఆసరా చేసుకుంటున్న స్థిరాస్తి వ్యాపారులు వ్యవసాయ భూములకు నాలా పన్నులను చెల్లించకుండా విక్రయిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. జిల్లాలో  నాలా చెల్లించకుండా ఇప్పటి వేల ఎకరాల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమికి విక్రయించారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి సంబంధిత భూమి యజమాని ఆర్డీవోకు నాలా కింద దరఖాస్తు సమర్పించాలి. సంబంధిత మండల, డివిజన్‌ రెవెన్యూ శాఖ అధికారులు నాలా కోసం వచ్చిన దరఖాస్తు ప్రకారం స్థలాన్ని పరిశీలించి వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు అంగీకరిస్తారు. మార్కెట్‌ విలువలో 3 శాతం చొప్పున రుసుంను సంబంధిత భూమి యజమాని రెవెన్యూశాఖ ఖాతాల్లో చలాన్‌ ద్వారా జమ చేయాలి. అప్పుడే ఆ భూమిని వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చినట్లు సంబంధిత రెవెన్యూ డివిజన్‌ అధికారిధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. ఇలా వ్యవసాయేతర భూమిగా మార్చిన తరవాతే ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టాలి. స్థిరాస్తి వ్యాపారులు నాలా పన్నులను చెల్లించకుండా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుతూ ఆదాయానికి గండి కొడుతున్నా సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోని మండల , నియోజకవర్గ కేంద్రాలు, ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న భూముల్లో లే-అవుట్లు చేస్తున్నారు. నాలా పన్నును చెల్లించకుండా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చే వారిపై కఠని చర్యలు తీసుకుంటామని, దీనిపై ఆర్డీవోలు, తహశీల్దార్లకూ స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు చేసినా అమలు కావడం లేదు.
————-