నాలుగేళ్ల అభివృద్దిని ముందుకు తీసుకుని వెళదాం

 

కూటమికి ఓటేస్తే నోట్లో మన్నే

ప్రజలు నిర్ణయాత్మక తీర్పు ఇవ్వాలి: మంత్రి ఈటెల

కరీంనగర్‌,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే నాలుగేళ్లలో చేపట్టిన అభివృద్ధి ఆగిపోతుందని లేకుంటే మూలన పడుతుందని మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తున్న కూటమి నేతలను తరిమికొట్టాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రైతు కడుపు ఎండిందని.. టీఆర్‌ఎస్‌ హయాంలో రైతు కడుపు నిండిందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వంద స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని, ఏ సర్వేలైనా ఇదేమాట చెప్తున్నాయని ఈటెల అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీకి, టీడీపీకి ఓటేస్తే అమరావతికి పోతుందని, మోసం చేయడానికి ఒకటై వస్తున్న మహాకూటమికి ఓటుతో గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతే రాజుగా పాలన సాగుతున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా రైతు కావడంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతాంగాన్ని ఆదుకుంటున్నారని చెప్పారు. వచ్చే వానకాలం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి చెరువును, కుంటను నింపుతామని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 24 గంటల కరంట్‌ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మన పథకాలను ఇతర రాష్ట్రాలవారు ఆదర్శంగా తీసుకొని వారి రాష్ట్రాల్లో అమలుచేశారని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే కరంట్‌ కష్టాలు మళ్లీ వస్తాయన్నారు. ఇప్పుడున్న పథకాలన్నింటినీ రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్‌ను, మహాకూటమిని నిలదీయాలన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన పలువురిని కులసుకని ఓట్లను అభ్యర్థించారు. నాలుగేళ్‌ అభివృద్దిని ఏకరువు పెట్టారు. రైతుబాంధవుడైన సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని మంత్రి కోరారు. తెలంగాణ ప్రజలపై తెలంగాణ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలుగు ఆత్మగౌరవం కోసం పుట్టిన టీడీపీ.. కాంగ్రెస్‌తో కలిసి ఢిల్లీకి తాకట్టు పెడుతోందని అన్నారు. ఇంతకన్నా దారుణం మరోటి ఉండబోదన్నారు. కేవలం అధికారం కోసం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలే టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో. టీడీపీ, కాంగ్రెస్‌లకు తెలంగాణ, ఏపీలలో వేర్వేరు ప్రయోజనాలున్నాయన్నారు. రైతులను సంఘటిత శక్తిగా మార్చిన రైతు సమన్వయ సమితులను ఎందుకు రద్దు చేస్తారు. అన్నింటిని వద్దు వద్దంటున్న కాంగ్రెస్‌ను ప్రజలు వద్దనుకుంటున్నారని, వంద సీట్లు గెలిచి మళ్లీ అధికారం చేపడతామని అన్నారు.