నా వారసుడు..స్టాలిన్
చెన్నై : డిఎంకెలో వారసత్వ సమస్యకు ఆ పార్టీ అధినేత కరుణానిధి తెర దింపారు. తన వారసుడిగా తన చిన్న కుమారుడు స్టాలిన్‌ను ప్రకటించారు. తన వారసుడు స్టాలిన్ అనే సంకేతాలను ఆయన స్పష్టంగా ఇచ్చారు. తన తర్వాత పార్టీ పగ్గాలు స్టాలిన్ చేతుల్లోకి వెళతాయని ఆయన చెప్పారు. స్టాలిన్ ప్రస్తుతం పార్టీ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. చెన్నైలో గురువారం ఆయన పార్టీ కార్యక్రమంలో మాట్లాడారు. తన తుది శ్వాస వరకు సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని, తన తర్వాత ఎవరు ఆ పని చేస్తారనే ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడే కూర్చున్న స్టాలిన్‌ను మరిచిపోవద్దని ఆయన అన్నారు. ఆ మాటలు అనగానే పార్టీ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చెలరేగాయి.
స్టాలిన్‌కు తన వారసత్వాన్ని అప్పగించనున్నట్లు కరుణానిధి గతంలో కూడా సంకేతాలు ఇచ్చారు. అయితే, కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకె అళగిరి దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే, స్టాలిన్ పార్టీ పగ్గాలు చేపట్టడం ఖాయమనే విషయం కరుణానిధి ప్రస్తుత మాటలను బట్టి అర్థమవుతోంది. కరుణానిధి తర్వాత పార్టీ అధినేతగా స్టాలిన్‌ను అంగీకరించడానికి అళగిరితో పాటు కొంతమంది సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తూ వచ్చారు. స్టాలిన్ పార్టీ కోశాధికారిగా ఉండడమే కాకుండా పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా కూడా
ఉన్నారు. మధురైలో పట్టు ఉన్నఅళగిరి రెండు నెలల క్రితం తన ప్రాంతంలో పార్టీ నేతల ఎంపికపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ముఖ్యంగా పార్టీ యువజన విభాగం కూర్పును ఆయన వ్యతిరేకించారు. తనసూచనలను నిర్లక్ష్యం చేశారంటూ అళగిరి స్టాలిన్‌పై పరోక్ష యుద్ధం ప్రకటించారు.