నా వ్యాఖ్యలు ఉపసంహరించుకోను

– క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు ..పత్రికల్లో నిత్యం రేప్‌ వార్తలే

– మేక్‌ ఇన్‌ ఇండియా ఎక్కడికి పోయిందన్న రాహుల్‌

– క్షమాపణలు చెప్పాల్సింది ప్రధాని మోడీ అని డిమాండ్‌

న్యూఢిల్లీ,డిసెంబర్‌ 13(జనంసాక్షి):జార్ఖండ్‌లో ఎన్నికల ర్యాలీలో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ సమర్థించుకున్నారు. మేకిన్‌ ఇండియా కాదు.. రేప్‌ ఇన్‌ ఇండియా అని చేసిన వ్యాఖ్యలపై మరోసారి ఆయన స్పందించారు. లోక్‌సభ నిరవధిక వాయిదా అనంతరం బయటకు వచ్చిన రాహుల్‌ విూడియాతో మాట్లాడారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తన వ్యాఖ్యలు సరైనవే అని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్‌ ఇండియా గురించి మాట్లాడుతుంటారని, ఎవరైనా మేకిన్‌ ఇండియా వార్తల కోసం పేపర్‌ ఓపెన్‌ చేస్తే ఆ వార్తలు కనిపించడం లేదన్నారు. ఆ వార్తల స్థానంలో మనం ఏం చూస్తున్నాం.. రేప్‌ వార్తలు చూస్తున్నామని రాహుల్‌ అన్నారు. పేపర్లలో కోకోల్లలుగా రేప్‌ వార్తలు వస్తున్నాయని.. అందుకే ఇది మేకిన్‌ ఇండియా కాదు.. రేప్‌ ఇన్‌ ఇండియా అని వ్యాఖ్యానించానని రాహుల్‌ సమర్థించుకున్నారు. తాను కాదు క్షమాపణలు చెప్పాల్సింది.. మోదీ అని రాహుల్‌ చెప్పారు. ఎందుకంటే ఈశాన్య రాష్టాల్ల్రో మంట రాజేసినందుకు, భారత ఆర్థిక వ్యవస్థను విచ్చిన్నం చేసినందుకు మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.