నింగికేగిన ఉద్యమ కెరటం
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగిల్చిన
వంటేరు నారాయణరెడ్డి సార్ కన్నుమూత
జగదేవ్ పూర్, అక్టోబర్ 15 (జనంసాక్షి):
తెలంగాణ ఉద్యమకారుడు , రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేత , గజ్వేల్ జనం పెద్దాయనగా పిలవబడే వంటేరు నారాయణరెడ్డి సార్ (83) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాదపడుతున్న నారాయణరెడ్డి సార్ హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. సీఎం కేసీఆర్ పిలుపుతో ఉద్యమానికి ఊపిరి పోసిన నారాయణరెడ్డి సార్ కు తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడుగా నిరాడంబర జీవితాన్ని కొనసాగించారు. చిన్ననాటి నుండే సీమాంధ్ర పాలకులను విబేదిస్తూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ఆయన అగ్రికల్చర్ అధికారుల సంఘం రాష్ట్ర నేతగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఉద్యోగులను చైతన్యం చేశారని చెప్పవచ్చు . పదవీ విరమణ అనంతరం కేసీఆర్ పిలుపుతో గులాబీ జెండా చేత పట్టిన ఆయన సొంత డబ్బుతో 14 ఏళ్ల పాటు వివిధ ఖర్చులు భరించగా , ఏ రోజు కూడా పదవులు ఆశించని నేతగా పేరుంది . ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే నారాయణరెడ్డిని దివంగత ప్రొఫెసర్ జయశంకర్ , సీఎం కేసీఆర్ లు ఆయనను ఎప్పుడూ పెద్దాయనగా గౌరవిస్తూ” సార్ “గానే సంబోధిస్తూ వచ్చేవారు . ఉద్యమంలో అడుగిడిన వంటేరు నారాయణరెడ్డి సార్ యువత , ఉద్యోగ , ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు , కుల సంఘాలను సమీకరించి గజ్వేల్ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు . నిజాయితీగా , నిస్వార్థంగా ఉద్యమానికి ఉప్పందించిన ఆయన చరమాంకంలో కెసిఆర్ ను సైతం విభేదించారు . నారాయణరెడ్డి మృతిని ఉద్యమకారులు , ప్రజలు జీర్ణించుకోలేకపోతుoడగా , కెసిఆర్ ఇచ్చిన ప్రతి పిలుపు విజయవంతం చేస్తూ ఉద్యమ చరిత్రలో తిరుగులేని పోరాటం చేసిన ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు .
రేపు క్యాసారంలో అంత్యక్రియలు
ఉద్యమకారుడు వంటేరు నారాయణరెడ్డి అంత్యక్రియలు సొంత గ్రామమైన క్యాసారంలో ఆదివారం జరగనున్నాయి . ఇందుకోసం ఆయన అభిమానులు , కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు . కాగా ఆయన అంత్యక్రియలకు మంత్రి హరీష్ రావు , ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తో పాటు వివిధ రంగాల ప్రముఖులు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది .
Attachments area