నిండుకుండలా నిజాంసాగర్‌ జలాశయం

మూడు గేట్లు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటి విడుదల
కామారెడ్డి,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో భారీగా వరద అక్కడికి చేరుతోంది. దీంతో మూడు గేట్లు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ మేరకు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు. ప్రస్తుతం 1,404 అడుగులకు చేరుకుంది. దీంతో మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీ వరద కొనసాగుతున్నది. ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఎస్సారెస్పీకి భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం 2 లక్షల 25 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండడంతో 3లక్ష 24వేల క్యూసెక్కుల ఔట్‌ ఎª`లోను 41 వరద గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. ఎస్సారెస్పీలో గరిష్ఠ నీటిమట్టం 1,091 అడుగులు కాగా 1,089 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 73.458 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. నవీపేట మండలంలోని మిట్టాపూర్‌ శివారులోని వందలాది ఎకరాల పంట నీట మునిగింది. శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ ముంచెత్తడంతో వరి పైర్లు పూర్తిగా మునిగి పోయాయి. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. మండలంలోని యంచ, నందిగామ, మిట్టాపూర్‌, కోస్లీ,బినోలా తదితర గ్రామాలకు చెందిన పంట పొలాలను శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ ముంచెత్తింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.