నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు భరోసా
నిజామాబాద్,అక్టోబర్ 4(జనంసాక్షి): నిజాంసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. శ్రీరాంసాగర్ నుంచి నీరు విడుదలతో పంటలకు ఢోకా లేదని అన్నదాతలు అంటున్నారు. సాగర్ నిండితే నిజామాబాద్ వ్యవసాయరంగానికి కళ ఎండితే వెలవెల అన్న నానుడి ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. మంజీర పరివాహక ప్రాంతం జిల్లాలో మొదలయ్యే నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు మొదలు నిజాంసాగర్ జలాశయం కింద ఉంటే నిజాంసాగర్, పిట్లం, బిచ్కుంద, బాన్సువాడ, బీర్కూరు, కోటగిరి, బోధన్ మండలాల్లో నదికి రెండు వైపులా ఒడ్డునకు ఆనుకుని 1.5లక్షల ఎకరాల వరకూ ఉంటుంది. ఈ భూముల్లో రైతులు బోర్లు వేసి పంటలు సాగు చేసుకుంటారు. ప్రస్తుతం నదిలో గణనీయంగా వరద ప్రవాహం నమోదవుతున్న నేపథ్యంలో నీటి కొరత ప్రసక్తే లేకుండా సాగునీరు పంటలకు అందుతుంది. నిజాంసాగర్ జలాశయం అత్యంత స్పల్ప వ్యవధిలో నిండుతుందన్న నమ్మకం మరోసారి నిజమైంది. మంజీర నదిలోకి భారీ పరిమాణంలో నీటిని విడుదల చేసిన దాఖలాలు గతంలో ఉన్నాయి.