నిజాం షుగర్ ఫ్యాక్టరీని సర్కారు స్వాధీనం చేసుకోవాలి
– కేసీఆర్ హామీ నిలబెట్టుకోవాలి
– కోదండరాం
సుభాష్‌నగర్,ఆగస్టు 27(జనంసాక్షి):అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హావిూని విస్మరించారని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదంరాం విమర్శించారు. ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాం పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..’బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపించాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. ఉద్యమ సమయంలో ఇది ప్రధాన అంశం. ఈ విషయంలో చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని వేచి చూశాం. అలాకానిపక్షంలోనే ప్రత్యక్ష కార్యచరణ అనివార్యమైంది. జిల్లా చరిత్రలో నిలిచిపోయే ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం’ అని కోదండరాం స్పష్టం చేశారు.బోధన్‌లోని గ్రామాల్లో పర్యటించి రైతుల అభిప్రాయాలను సేకరించగా.. ఫ్యాక్టరీని తెరిపించాలనే డిమాండ్ వినిపించిందన్నారు. నిజాం షుగర్స్ మళ్లీ తెరిపించేందుకు గ్రామగ్రామాన సభలతో ప్రజలను చైతన్యపరుస్తామని, ధూంధాం, పోస్టర్ల ఆవిష్కరణ, సంతకాల సేకరణ, పుస్తకం ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశామని తెలిపారు. బోధన్ నుంచి నిజామాబాద్‌కు పాదయాత్ర, అనంతరం నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు మహా పాదయాత్ర చేపట్టబోతున్నట్లు వివరించారు. అదేసమయంలో జిల్లా ప్రజాప్రతినిధులపై, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఈలోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశ ఉందన్నారు. ప్రభుత్వం నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ ఉద్యమానికి సంబంధించి ప్రత్యక్ష కార్యచరణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.