నిజామాబాద్‌లో జంట హత్యల కలకలం

– మూడు రోజుల క్రితం హత్య
– దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు
– కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నిజామాబాద్‌, మే3(జ‌నంసాక్షి) : నిజామాబాద్‌ పట్టణ కేంద్రంలో జంట హత్యల కలకలం సృష్టించింది. కంటేశ్వర్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌లో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడురోజుల కిందట జరిగిన ఈ హత్యోదంతం శుక్రవారం ఉదయం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. కాలనీకి చెందిన నాగభూషణం అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్న కర్ణాటక రాష్టాన్రికి చెందిన శ్రీకాంత్‌(30)తో పాటు మరో యువకుడు హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హత్య అనంతరం హంతకులు అద్దెకు ఉంటున్న గదికి తాళం వేసి పరారయ్యారు. ఆ గది నుంచి శుక్రవారం ఉదయం దుర్వాసన రావడంతో ఇంటి యజమాని కిటికీలోంచి చూడగా ఈ విషయం బయటపడింది. దీంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారమందించారు. ఘటనపై నిజామాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌, సీఐ నరేష్‌, ఎస్సై సంతోష్‌ దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన శ్రీకాంత్‌ స్థానికంగా టీ కొట్టును నడుపుతుండగా మరో వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై  దర్యాప్తు చేపట్టారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.