నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం – మండల మహాసభను జయప్రదం చేయండి

హుజూర్ నగర్ అక్టోబర్ 10 (జనం సాక్షి): రోజు రోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రించడంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్ విమర్శించారు. ఈనెల 14న హుజూర్ నగర్ మండలం శ్రీనివాసపురం గ్రామంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల 7వ మహాసభలు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక పోరాటాల మూలంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో అధికారులకు వచ్చిన బిజెపి ప్రభుత్వం రోజురోజుకు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఈనెల 14న మండల పరిధిలోని శ్రీనివాసపురంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభకు ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యురాలు తంగేళ్ల వెంకట చంద్ర, నూకల లక్ష్మీ నరసమ్మ, తంగిళ్ళ గోపరాజు, వెంగల్రెడ్డి నారాయణరెడ్డి, కట్ట కృష్ణారావు, నరసింహారావు, పోలే శీను తదితరులు పాల్గొన్నారు.