నియోజకవర్గానికో మహిళా పోలింగ్ కేంద్రం
ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్,నవంబర్17(జనంసాక్షి): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నియోజకవర్గానికి ఒక మహిళా పోలింగ్ కేంద్రం ఏర్పాట్లు చేయనున్నట్లు ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఇందులో మహిళా సిబ్బందిని నియమిస్తామన్నారు. ఈ కేంద్రాల్లో మహిళతోపాటు పురుషులు కూడాఓట్లు వేసుకోవచ్చని సూచించారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన రూ.28లక్షలకు మించి ఖర్చు చేస్తే వారిని అనర్హులుగా ప్రకటిస్తామని అన్నారు. ఎన్నికల్లోపు అభ్యర్థుల ఖర్చుల నిర్వహణ రిజిష్టర్‌ను ఎక్స్‌పెండేచర్ అబ్జర్వర్ల పరిశీలనకు పంపించాలన్నారు. ఒక్కో ఖర్చుల రిజిష్టర్‌ను మూడుసార్లు పరిశీలిస్తారని, అలాగే తమ నిఘా బృందాలు వేసిన లెక్కలను కూడా పరిగణలోకి
తీసుకుంటారని స్పష్టం చేశారు. పరిశీలకలు ఈ నెల 22న వచ్చి ఎన్నికలు ముగిసే వరకు ఇక్కడే ఉండి వారికి నిర్ధేశించిన నియోజకవర్గాలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమైజేషన్ ద్వారా ఈవీఎంల పంపిణీ ఇప్పటికే పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.ఎన్నికల నిర్వహణకు 4,500 మంది సిబ్బంది అవసరమని అంచనా వేస్తుండగా జిల్లాలో 5,900 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నారని ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల్లో అవసరమైన సిబ్బందికి అదనంగా పది శాతం సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్లకు అదనంగా పది శాతం ఈవీఎంలను ఈ ర్యాండమైజేషన్‌లో కేటాయించినట్లు వివరించారు.