నియోజకవర్గ అభివృద్దిపై చర్చకు సిద్దమా

కాంగ్రెస్‌ కుటిల ప్రచారాలను తిప్పి కొట్టాలి

కెసిఆర్‌ నాయకత్వమే తెలంగాణ రక్ష: ముత్తిరెడ్డి

జనగామ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ప్రజాహితమే సీఎం కేసీఆర్‌ అభిమతమని, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలని జనగామ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. అమలుకు సాధ్యం కాని హావిూలను ప్రతిపక్షాలు చేస్తున్నాయని, వాటిని నమ్మొద్దని అన్నారు.

రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతిపక్షాలకు కనబడడం లేదా అని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రశ్నించారు. ఉనికి కోసమే ప్రతిపక్షాలు అర్థరహిత ఆరోపణలు చేయడం తగదని, వాటిని మానుకోవాలని హితవు పలికారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్న తనను తిరిగి గెలిపించాలని మంగళవారం పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పాటు చేసినప్పటి నుంచి సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి పార్టీలకతీతంగా అందాయని గుర్తు చేశారు. ప్రజలను మభ్య పెట్టేందకు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లు వెనుకేసుకున్న కాంగ్రెస్సోళ్లకు ఏం చేయాలో తోచడం లేదన్నారు. రైతన్నలు అకాల మరణం చెందితే ఆ కుటుంబలు వీధిన పడకుండా ఆ కుటుంబాలకు రూ.5 లక్ష లు అందించి ఆదుకుంటున్న మంచి పథకం వద్దని కోర్టుకు పోతామని వ్యాఖ్యలు చేయడం రైతన్నలు గుర్తించాలన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌కు మరింత పెరుగుతున్న ఆదరణ చూసి ఆంధ్రోళ్లు జీర్ణించుకోవడం లేదన్నారు. మల్లన్న గండి, బొమ్మాకూర్‌ రిజర్వాయర్ల ద్వారా అన్ని గ్రామాల చెరువులకు సాగు నీటిని పంపింగ్‌ చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి మల్లన్నగండి, బొమ్మాకూర్‌, వెల్దండ రిజర్వాయర్లతో గోదావరి జలాతో పలుమార్లు నింపి సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాలకు చెందిన చెరువులు నింపినట్లు, రానున్న రోజుల్లో నర్మెట, తరిగొప్పుల మండలాల్లోని అన్ని గ్రామాలకు చెరువు, కుంటలు నింపుతామని హావిూ ఇచ్చారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమక్ష్యంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ముత్తిరెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు.