నియోజకవర్గ ప్రజల ఊపిరిగా పనిచేస్తా: విద్యాసాగర్‌ రావు

జగిత్యాల,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): నా కోరుట్ల నియోజకవర్గ ప్రజలే ఊపిరిగా, ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం నియోజకవర్గానికి పాలకునిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని కోరుట్ల తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అభిప్రాయపడ్డారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి తనను వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. తుదిశ్వాస విడిచే వరకు  వారి సంక్షేమం లక్ష్యంగా పాటుపడ తానని అన్నారు. కోరుట్ల నియోజకవర్గాన్ని ఎంపీ కల్వకుంట్ల కవిత, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమష్టి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి పరచి రాష్ట్రస్థాయిలో ఓ గుర్తింపు సాధించమాన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలనలో కేవలం నాలుగున్నర ఏండ్లలో నలభై ఏండ్ల అభివృద్ధి పనులను మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ఎల్లవేళాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఓ గొప్ప నాయకుడని, ఆయన టీమ్‌లో ఎమ్మెల్యేగా పనిచేయడం తన అదృష్టమన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓ ర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు పనిగట్టుకోని ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఎవరు ఏమి చేశారో అని స్పష్టంగా తెలుసని, రానున్న ఎన్నికల్లో మళ్లీ తగిన బుద్ది చెబుతారని తెలిపారు. గ్రామాల్లో ఆయన ప్రచారానికి గ్రామగ్రామాన గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డప్పుచప్పుళ్లు, మంగళహారతులు, పులివేషధారణాలు, బతుకమ్మలు గొల్లెనలతో అపూర్వ స్వాగతం పలికారు. ఇవన్నీ కూడా తనను మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకుని వెళుతున్నాయని అన్నారు. ఇక్కడి ప్రజల కష్టాసుఖాలు అన్ని తెలుసని అందుకే క్షేత్రస్థాయిలో అభిమానం సంపాదించుకున్నానని చెప్పారు.