నిరుద్యోగ భూతాన్ని తరిమే చర్యలేవీ?
ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాలు కేవలం బడాబాబులకే లబ్ది చేకూర్చేలా ఉన్నాయి. దేశంలో ఆర్థిక వవ్యస్థ అస్తవ్యస్థం కావడంతో పాటు ఉద్యోగాల కల్పన అన్నది ఎండమావిగా మారింది. కొత్తగా ఉద్యోగాలు రాక లక్షలాదిగా యువత నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. ఎక్కడా ఉపాధి దక్కడం లేదు. నోట్లు రద్దు,జిఎస్టీ వంటి వాటితో ఉపాధి అవకాశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయాయి. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. స్వయం ఉపాధి పడకేసింది. గ్రామాల్లో ఉపాధి దొరక్క వలసలు పెరిగాయి. ప్రచారార్భాటాలు మినహా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా యువత ఉద్యోగా లకోసం ఎలాంటి పని చేయడానికైనా సిద్దంగా ఉంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ ఘటన చూస్తే ఎంతమంది నిరుద్యోగులు పట్టాలు పట్టుకుని చకోర పక్షుల్లా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలో ఇటీవల 62 మెసెంజర్ ఉద్యోగాలకు నియమాక పక్రియ చేపట్టడగా వేలాది మంది ఉన్నత విద్యావంతులు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో పిహెచ్‌డి పొందిన డాక్టరేట్లు కూడా ఉన్నారు. ఇంతలా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడం నిరుద్యోగ సమస్య భయానక దుస్థితికి అద్దం పడుతోంది. స్టేషన్‌లో బట్వాడా చేరవేసే ఈ ఉద్యోగానికి కనీసం ఐదో తరగతి చదివి, సైకిలు తొక్కడం వస్తే సరిపోతుంది. ఇలాంటి చిరుద్యోగానికి 50 వేల మంది పట్టుభద్రులు, 3,700 మంది పిహెచ్‌డి గ్రహీతలు, ఎంబిఎ, ఎంసిఎ వంటి ఉన్నత విద్యాభ్యాసం చేసినవారితో సహా 93 వేల మంది పోటీ పడ్డారంటే ఉపాధి కోసం యువతరం ఎంతగా ఎదురుచూస్తుందో పాలకలుకు అర్థంఅ యినట్లు లేదు. యువతలో ఆగ్రహావేశాలు రాకుండా చూసుకుని ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరాన్ని బాధ్యతనలు పాలకులు విస్మరించారనడానికి ఇంతకన్నా నిరద్శనం అక్కర్లేదు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే కాదు దేశమంతటా ఇదే దుస్థితి నెలకొంది. మేకిన్ ఇండియా అంటూ ఊదరగొట్టిన మోడీ విధానాలు నిరుద్యోగులను పెంచిందే తప్ప కార్యారూపంలో ఒక్కరికి కూడా ఉద్యోగాన్ని ఇవ్వలేక పోయింది. బ్యాంకింగ్,ఐటి రంగాల్లో ఆటోమేషన్, రోబోటిక్స్, ఇ-కామర్స్ వంటి విధానాలు ఉపాధి అవకాశాలను గండి కొడుతున్నాయి. వాల్‌మార్ట్, అమెజాన్ వంటి బడా బహుళ జాతి కంపెనీలకు తలుపులు బార్లా తెరిచివేయడంతో స్థానిక సాంప్రదాయ ఉపాధి కూడా బలైపోతోంది. చిన్నచిన్న దుకాణాలు మూత పడుతున్నాయి. కుటీర పరిశ్రమలు ఎప్పుడో కనుమరుగయ్యాయి. అధికారంలోకి వస్తే ఏటా కోటి ఉద్యోగాలు సృష్టిస్తామంటూ ఆశలు కల్పించి గత ఎన్నికల్లో ఓట్లు దండుకున్న మోడీ ఇప్పుడు ఎన్నికల సమయం సవిూపిస్తున్నా ఉపాధిపై మాట్లాడడం లేదు. నోట్లరద్దు, లోపభూయిస్టమైన జిఎస్టీ అమలు మూలాన అసంఘటిత రంగం ఛిన్నాభిన్నమై దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాలను దెబ్బతీసారు. 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా ఉత్సవ విగ్రహాలుగా మారి బిజెపి ప్రచారానికి ఉపయోగపడ్డాయే కానీ నిరుద్యోగుల ఉపాధి ఆశలను లేషమాత్రం కూడా తీర్చలేక పోయాయి. దేశంలో ద్రవ్యోల్బణం కంటే నిరుద్యోగ సమస్యే పెనుభూతంగా మారిందని ప్రణాళిక సంఘం మాజీ అధ్యక్షులు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా వంటి ఆర్థిక వేత్తలు ఘోషించినా కేందంరరాష్ట్ర ప్రభుత్వాలకు చెవికెక్కడంలేదు. దీంతో నిరుద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. స్వయం ఉపాధి కోసం ప్రయత్నం చేద్దామన్నా అవకాశాలు రావడం లేదు. పాలక పక్షాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్త మందగించింది. డారల్ మారకం రేటుతో రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోంది. ప్రభుత్వ రంగాన్ని, ప్రకృతి వనరులను ప్రయివేటుకు ధారాదత్తం చేశారే తప్ప ఉపాధికి నిరిష్టమైన భరోసా కల్పించలేక పోయారు. దేశానికి వెన్నెకముకైనటువంటి వ్యవసాయరంగం
కుదేలయ్యింది. గిట్టుబాటు ధరలు లేక రైతుల నడ్డి విరిగాయి. పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయిన పల్లెలను పట్టించుకోవడం లేదు. ఉపాధి ఎండమావిగా మారిపోవడంతో ప్రజలంతా తట్టాబుట్టా సర్దుకుని పట్టణబాట పట్టింది. లేబర్ బ్యూరో గణాంకాల ప్రకారం వ్యవసాయరంగంలో 84.6 లక్షల పైగా ఉద్యోగాలు, తయారీ, విద్యుత్ ఉత్పాదన, నిర్మాణ రంగంలోనూ 28.1 లక్షల ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. సేవల రంగంలో 66.5 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చినా ఇంకా 112.7 లక్షల ఉద్యోగాలు కోల్పోవల్సి వస్తోంది. దీనికితోడు దేశంలో 650 విశ్వవిద్యాలయాలు, 60 వేల కళాశాల నుంచి ఏటా 1.25 కోట్ల మంది నిరుద్యోగ సైన్యంలో చేరిపోతున్నారు. ప్రభుత్వ రంగంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానాలతో ఉపాధి భద్రత లేకపోవడం, శ్రమదోపిడి పెరిగి పోవడంతో ఉద్యోగాల సంఖ్య అమాంతం తగ్గిపోతోంది. ప్రయివేటు కంపెనీల్లోనూ ఉపాధి అన్నది భరోసాలేని బతుకుగా మారింది. కొత్తవాల్లను తీసుకోవడం ..పాతవాళ్లను తీసేయడం అన్నచందంగా మారింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పాలకులు పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నా రాష్ట్రాల్లోనూ ఉపాధికి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవడం లేదు. కార్మిక చట్టాలకు తూట్లుపొడిచి కార్పోరేట్ అనుకూల విధానాలు అమలు చేయడంతో అక్కడా శ్రమదోపిడీ తప్ప భరోసా ఉండడం లేదు. వ్యవసాయరంగాన్ని కాపాడడం, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకొని, ప్రకృతి వనరులు, గనులు ఉన్నచోట సంబంధిత పరిశ్రమలను ప్రభుత్వ రంగంలోనే నెలకొల్పి ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు అమలుచేయాల్సిన అవరాన్ని గుర్తించాలి. వ్యవసాయాధారిత సంస్థలను స్థాపించాలి.బయ్యారం, కడప ఉక్కు లాంటి పరిశ్రమలను ప్రోత్సహించాలి. లేకుంటే యువతలో నిరాశానిస్పృహలు పెరగుతాయి. అది దేశానికి మంచిది కాదని పాలకులు గుర్తుంచుకోవాలి.