నిరుపయోగంగా ఖరీదైన యంత్రాలు

అభివృద్ధి పేరుతో ఖరీదైన యంత్రాలు కొనుగోలు

అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపం

వాడకం తక్కువ మరమ్మతులు ఎక్కువ

పినపాక నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 12 జ (జనం సాక్షి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణ అభివృద్ధి కై పురపాలక అవసరాల కోసం, లక్షలు పోసి యంత్రాలు, పరికరాలు, వాహనాలు కొనుగోలు చేసి అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపాల కారణంగా వృథాగా పడి ఉంటున్నాయి. లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న వాహనాలు, యంత్రాలు కొద్ది రోజుల్లోనే ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. మరమ్మతులు నిర్వహించి అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెబుతున్నా ఫలితం ఉండటం లేదు.

నిరుపయోగంగా బారీ యంత్రాలు:

మున్సిపాలిటీ అవసరాల కోసం లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న యంత్రాలు, వాహనాలు, పరికరాలు… ఆస్తుల్ని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మణుగూరు పురపాలికలో రూ 12 లక్షలతో కొనుగోలు చేసిన రోడ్లూడిచే యంత్రవాహనం 5 నెలలుగా పక్కన పడింది. మరమ్మత్తులకు గురికావడంతో అధికారులు దాన్ని పక్కన పడేశారు. బాగు చేసేందుకు కావాల్సిన పరికరాలు స్థానికంగా దొరక్కపోవడంతో… యంత్రాన్ని పంపిణీ చేసిన ఏజెన్సీకి ఆర్డర్ పెట్టారని చెబుతున్నారు. అవి రాగానే తిరిగి వినియోగంలోకి తెస్తామని చెబుతున్నారు. చిన్న మరమ్మత్తులతో తిరిగి వినియోగించుకునే అవకాశం ఉన్నా… అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పురపాలికల్లో చెత్త సేకరించే ఆటోలు, మురికి కాల్వలు శుభ్రం చేసే యంత్రాలు, ఫాగింగ్ మిషన్లు మూలన పడేస్తున్నారు. నిర్వహణ లోపంతో ఖరీదైన యంత్రాలు ఉపయోగించడం లేదు.

 

అభివృద్ధి పేరుతో ఖరీదైన యంత్రాలు కొనుగోలు :

మణుగూరు మున్సిపాలిటీ వారు అభివృద్ధి పేరుతో ఖరీదైన యంత్రాలు కొనుగోలు చేసి వృధాగా పడేస్తున్నారు. స్వీపింగ్ మిసిన్ ( రోడ్డుచే యంత్రం) రూ 12 లక్షలు, ఆ యంత్రం ఉపయోగించడానికి వాడే ట్రాక్టర్ ఆరు లక్షలు, తడి పొడి చెత్త సేకరణ వాహనాలు ఒక్కొక్కటి ఆరు లక్షల చొప్పున 18 కొనుగోలు చేశారు.సక్షన్ మిసిన్ ( బురద లాగే యంత్రం) రూ 12 లక్షలు, నాలుగు ట్రాక్టర్లు ఒక్కొక్కటి ఐదు నుంచి ఆరు లక్షలు రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి ఏ చిన్న రిపేర్ వచ్చిన రోజుల తరబడి పక్కన పెడుతున్నారు మరమ్మత్తులు చేయించడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో ఖరీదైన యంత్రాలు వృధాగా పడేస్తున్నారు.అధికారుల నిర్లక్ష్యం తో విలువైన యంత్రాలను ఉపయోగించక ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి యంత్రాలను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించి సద్వినియోగం చేసుకోవాలని స్థానికుల కోరుతున్నారు.