నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ ప్రమాదం

` 2019లోనే సమస్యలు సరిచేసి ఉంటే ఆనకట్ట దెబ్బతినేది కాదు
` ఊహించిన ప్రవాహ వేగంకంటే ఎక్కువ రావడంపై వల్లే ఆనకట్ట దిగువన సీసీబ్లాకులు, అప్రాన్‌లు ధ్వంసమయ్యాయి
` కాళేశ్వరం కమిషన్‌ ఎదుట ఎల్‌Êటీ నిర్మాణ సంస్థ వివరణ
హైదరాబాద్‌(జనంసాక్షి):మేడిగడ్డ ఆనకట్టలో నీరు నిల్వ చేసిన మొదటి సీజన్‌ తర్వాత 2019లోనే సమస్యలు వచ్చాయని, వాటిని అప్పుడే పరిష్కరించి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదని నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులు తెలిపారు. డిజైన్ల, డ్రాయింగ్స్‌ సమయంలో అంచనా వేసిన ప్రవాహవేగం కంటే ఎక్కువగా ఉండడం వల్లే ఆనకట్ట దిగువ భాగాన సీసీబ్లాకులు, అప్రాన్‌ దెబ్బతిన్నాయని, సమస్యలు అలాగే కొనసాగుతూ వచ్చి ఆ ప్రభావం ఏడో బ్లాక్‌పై పడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్‌ పీసీఘోష్‌ కమిషన్‌ ముందు ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులు విచారణకు హాజరయ్యారు. నిర్మాణ సమయంలో ఉన్న ప్రాజెక్టు డైరెక్టర్‌ రామకృష్ణరావు, ప్రస్తుత హైడల్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌, డీజీఎం రజనీష్‌?లు గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా జస్టిస్‌ పీసీ ఘోష్‌ వారిని ప్రశ్నించారు. ఆనకట్ట డిజైన్స్‌, డ్రాయింగ్స్‌, లోపాల్‌, కాఫర్‌ డ్యాం, ఆనకట్ట కుంగడానికి కారణాలు, లోపాలు, వాటికి చేసిన మరమ్మత్తులు, సబ్‌ కాంట్రాక్టులు, కుంగిన బ్లాక్‌ పునరుద్ధరణ తదితర అంశాలపై కమిషన్‌ వారిని ప్రశ్నించింది.నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్స్‌, డ్రాయింగ్స్‌ ప్రకారమే మేడిగడ్డ ఆనకట్ట నిర్మించామన్న ప్రతినిధులు భూమిని దశల వారీగా అప్పగించారని, అందుకు అనుగుణంగా పనులు చేశామని చెప్పారు. డిజైన్‌లో అంచనా వేసిన ప్రవాహవేగం కంటే ఎక్కువగా ఉన్నందునే ఆనకట్ట దిగువన అప్రాన్‌, సీసీ బ్లాకులు దెబ్బతిన్నాయన్న ప్రతినిధులు నీరు నిల్వ చేసిన మొదటి సీజన్‌ తర్వాతే మేడిగడ్డ ఆనకట్ట దిగువన సమస్యలు గుర్తించినట్లు తెలిపారు. వాటిని పరిష్కరించేందుకు తగిన డిజైన్స్‌ ఇవ్వాలని నీటిపారుదల శాఖను పలుమార్లు కోరినట్లు చెప్పారు. నాలుగేళ్లు అయినా నీటిపారుదల శాఖ నుంచి ఎలాంటి స్పందన లేదని, 2019 లోనే లోపాలను పరిష్కరించి ఉంటే మేడిగడ్డ ఆనకట్టకు ఇంత ప్రమాదం వాటిల్లేది కాదని ఎల్‌ అండ్‌ టీ సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఆనకట్టను ప్రారంభించిన తర్వాత నీటిని నిల్వ చేసినప్పటి నుంచి కుంగే వరకు ఆనకట్ట ఎప్పుడూ ఖాళీగా లేదని, ఏడో బ్లాక్‌? కుంగే వరకు నీరు నిండే ఉందని చెప్పారు. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో ఎలాంటి సబ్‌ కాంట్రాక్టులు ఇవ్వలేదన్న ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులు తక్కువ వ్యవధి ఉన్నప్పటికీ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడలేదని, పూర్తి నాణ్యతా ప్రమాణాలకు లోబడే నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు.