నిలిచిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర

– ఉదృతంగా ప్రవహిస్తున్న జీలం, సంగం నదులు
– వరద హెచ్చరికలతో యాత్రను నిలిపివేసిన అధికారులు
జమ్మూకాశ్మీర్‌, జూన్‌30(జ‌నం సాక్షి) : జమ్ము కశ్మీర్‌లోని జీలం నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. గత రెండ్రోజుల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో సంగం వద్ద నది 21 అడుగులు దాటి ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉండడంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతనాగ్‌ జిల్లాలోని కోకెరాంగ్‌లో రెండ్రోజుల్లో అత్యధికంగా 64.4ఎంఎం వర్షపాతం నమోదైందని, ఖాజిగంద్‌లో 58.6ఎంఎం, రాజధాని శ్రీనగర్‌లో 12.6ఎంఎం వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. శనివారం ఉదయం నుంచి జీలం నదిలో నీటి మట్టం బాగా పెరుగుతూ వస్తోందని, గంటకు ఒక అడుగు చొప్పున పెరుగుతోందని అధికారులు వెల్లడించారు. 2014లో కశ్మీర్‌లో వచ్చిన వరదల కారణంగా 300 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
అమర్‌ నాథ్‌ యాత్ర నిలిపివేత..
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద హెచ్చరికల నేపథ్యంలో అధికారులు శుక్రవారమే అమర్‌నాథ్‌ యాత్రను నిలిపేశారు. యాత్ర ప్రారంభమైన తర్వాత నిలిపేయడం ఇది రెండోసారి. భారీ వర్షాల కారణంగా యాత్రకు వెళ్లే మార్గాలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. అమర్‌నాథ్‌ యాత్రలోని ఓ బేస్‌క్యాంప్‌ అయిన పహల్‌గామ్‌లో 27.8ఎంఎం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. యాత్రికులందరినీ సురక్షితంగా బేస్‌ క్యాంపుల్లో ఉంచినట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత తిరిగి యాత్ర ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.