నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు దిశగా అడుగులు

ఆర్బిట్ 2022లో… మూడో అడుగుకు శ్రీకారం
సెప్టెంబర్ 23 ఈక్వినాక్స్ సందర్భంగా పరిశీలన
పగలు రాత్రి సమానంగా ఉండే రోజు
పాల్గొన్న సందీప్ కుమార్ మఖ్తల, శాస్త్రవేత్త రఘునందన్

మఖ్తల్, సెప్టెంబర్ 23, జనంసాక్షి

మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం ముడుమాల్ గ్రామ సమీపంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు తీసుకు వచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు జై మక్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు, టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మఖ్తల తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం ఈక్వినాక్స్ సందర్భంగా నిలువురాళ్ళ వద్ద… ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ తో కలిసి సూర్యుడి గమన దిశలను సందీప్ కుమార్ మఖ్తల పరిశీలించారు.
ఈ సందర్భంగా జై మఖ్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మఖ్తల మాట్లాడుతూ… ఆర్బిట్ 2022 లో భాగంగా నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు తీసుకు వచ్చే దిశగా మార్చి 20, 21వ తేదీన ఈక్వినాక్స్, జూన్ 21 సాల్ట్ సిస్.. పరిశీలించామని, తాజాగా శుక్రవారం మూడో మజిలీలో భాగంగా సెప్టెంబర్ 23 ఈక్వినాక్స్ అనగా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు పురస్కరించుకొని సూర్యుని గమన దిశలు ఇతరత్రా నమోదు చేసుకోవడం జరిగిందని, యునెస్కో గుర్తింపు కోసం కీలకమైన డాక్యుమెంటేషన్ కోసం ఈ వివరాలు తీసుకోవడం జరిగిందని అన్నారు. మఖ్తల్ లోని మన పూర్వీకులు ఎటువంటి టెలీస్కోప్, ఇతర పరికరాలు లేకుండా వాతావరణ మార్పులను నిలువురాళ్ళ నుండి తెలుసుకునేవారని, టెక్నాలజీలో మన మఖ్తల్.. వేల సంవత్సరాలనుండే ఎంతో ముందుంది అనటానికి నిలువురాళ్ళ ఒక నిదర్శనమని సందీప్ మఖ్తల తెలియచేసారు. సుమారు 3000 ఏళ్ల క్రితం అప్పటి మానవులు సూర్యుని గమన దిశలను బట్టి సంవత్సరంలోని నాలుగు ప్రత్యేక రోజుల సందర్భంగా… ఋతువులను ఇతర విషయాలను అర్థం చేసుకొని దానినిబట్టి వ్యవసాయ పనులు చేసేవారని అన్నారు. అప్పట్లోనే ఇలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో కేవలం నిలువురాళ్లు .. వాటి నీడలను బట్టి ఋతువులను గ్రహాస్థితులను పరిశీలించడం.. వారి అద్భుత మేధాశక్తికి నిదర్శనమని సందీప్ కుమార్ మఖ్తల తెలిపారు.
ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ మాట్లాడుతూ.. 3500 సంవత్సరాల క్రితం అప్పటి ఆదిమానవులు… ఎలాంటి టెక్నాలజీ లేకుండా ప్రస్తుతమున్న టెలిస్కోప్, శాటిలైట్ల తో సూర్యగమనం వాతావరణ దిశలను తెలుసుకుంటున్నా.. అప్పటి ఆదిమానవులు ఇవేవీ లేకుండానే సూర్యుడి యొక్క గమన దిశలు, వాతావరణ మార్పులు తెలుసుకున్నారని.. అందుకు నిదర్శనంగానే నిలువురాళ్ళు ఏర్పాటు చేశారని అన్నారు. నిలువు రాళ్లను ఏర్పాటు చేసిన వారు ఆదిమానవులు కారని .. వారు అత్యంత మేధాసంపన్నులని తెలియజేశారు. నిలువురాళ్ల ను పోలిన నిర్మాణం ఇంగ్లాండ్ లోని స్టోన్ హెంజ్ ఉంటుందని అన్నారు. సంవత్సరంలోని నాలుగు ప్రత్యేకమైన రోజులు… మార్చి 20(ఈక్వినాక్స్), జూన్ 21 (సాల్ట్ సిస్), సెప్టెంబర్ 23 (ఈక్వినాక్స్) , డిసెంబర్ 22 (సాల్ట్ సిస్)…రోజుల్లో సూర్యుడి గమన దిశలను రికార్డు చేయడం జరుగుతుందని..యునెస్కో గుర్తింపు కోసం ఇవి ఎంతో కీలకమని తెలిపారు. నిలువురాళ్ళను చూడాలనుకునేవారు 4 ప్రత్యేకమైన రోజులలో వచ్చి.. సూర్యుడి గమన దిశలను చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందని అన్నారు. ఈక్వినాక్స్.. మార్చి 20, సెప్టెంబర్ 23న .. ఆరోజు పగలు, రాత్రి సమానంగా ఉంటాయని… జూన్ 21 సాల్ట్ సిస్…లాంగెస్ట్ డే… అనగా పగలు ఎక్కువ ఉండే రోజు… డిసెంబర్ 22 సాల్ట్ సిస్ లాంగెస్ట్ నైట్.. అనగా రాత్రి ఎక్కువ ఉండే రోజు అని తెలిపారు.
సంవత్సర కాలంలోని నాలుగు ప్రత్యేకమైన రోజుల్లో జరిగే మార్పులను గుర్తించి, యునెస్కో గుర్తింపు కోసం డాసియర్ రూపకల్పన చేసి, నిలువు రాళ్లకు ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశం గా అంతర్జాతీయ ఖ్యాతిగా తీసుకురావడమే తన లక్ష్యమని జై మఖ్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మఖ్తల తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జై మఖ్తల్ ట్రస్ట్ ప్రతినిధులు బస్వరాజు, మర్రి శ్రీనివాస్ తోపాటు స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.