నిశ్చితార్థం తర్వాత మరొకరిని పెళ్లి చేసుకున్నందుకు దాడి: యువతి మృతి
కందుకూరు: తనను ప్రేమించి నిశ్చితార్థం జరిగిన తర్వాత వేరొకరిని వివాహమాడిన యువతిపై బావ దాడి చేసిన ఘటనలో యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. చెప్పులు కుట్టే కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన
యువతి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున చనిపోయింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని మురళీనగర్ గ్రామానికి చెందిన రాజు (25), సరోజ (21) ప్రేమించుకున్నారు. అతడు హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో క్యాబ్ డ్రైవర్లకు సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. సరోజ ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా చేస్తున్నారు. ఆమె రాజుకు వరుసకు మరదలు అవుతారు. పోలీసుల కథనం ప్రకారం -వారిద్దరి
సమ్మతితో కుటుంబ పెద్దల సమక్షంలో ఫిబ్రవరి 6న నిశ్చితార్థం జరిగింది. ఉగాది తర్వాత పెళ్లి చేయాలని నిశ్చియించారు. ఈ మధ్య కాలంలో సరోజ చిప్పలపల్లికి చెందిన ప్రభాకర్ (25)ను ప్రేమించారు. ఈ నెల 22న రాచులూరు పరిధిలోని రామాలయంలో వారు వివాహం చేసుకుని , అదే రోజు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సూచన మేరకు ఆదివారం పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉదయం ప్రభాకర్‌తో పాటు సరోజ కందుకూరు మండల చౌరస్తాలో బస్సు దిగి వారి పెద్దల కోసం ఎదురు చూస్తున్నారు. అటుగా వచ్చిన రాజు ఆమెను చూసి, పక్కనే చెప్పుల మరమ్మతు దుకాణంలో దారాలను కోయడానికి ఉపయోగించే కత్తి లాంటి పదునైనా పరికరాన్ని తీసుకుని దాడికి పాల్పడ్డాడు. ఆమెకు మెడ, వీపుపై గాయాలయ్యాయి. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ యువతి ఈ తెల్లవారుజామున మృతి చెందింది.