నీరవ్‌పై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు

– సీబీఐ అభ్యర్థన మేరకు జారీ చేసిన ఇంటర్‌పోల్‌
న్యూఢిల్లీ, జులై2(జ‌నం సాక్షి) : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును వేలకోట్ల రూపాయలకు మోసగించి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీపై ఎట్టకేలకు రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ అయింది. భారత దర్యాప్తు సంస్థ సీబీఐ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని నీరవ్‌పై ఇంటర్‌పోల్‌ ఈ నోటీసు జారీ చేసింది. విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్న నిందితులను అరెస్టు చేసేందుకు ఈ రెడ్‌కార్నర్‌ నోటీసు ఉపయోగపడుతుంది. రెడ్‌కార్నర్‌ నోటీసును ఇంటర్‌పోల్‌ తన సభ్యదేశాలకు జారీ చేస్తుంది. ఒక దేశానికి సంబంధించిన నేరస్థుడు ఇతర దేశాల్లో ఉంటే.. అతన్ని అరెస్టు చేయాలని ఇంటర్‌పోల్‌ తన సభ్య దేశాలను ఆదేశిస్తుంది. నీరవ్‌మోదీ కేసులో సీబీఐ ఇప్పటికే ముంబయిలోని ప్రత్యేక సీబీఐ న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్లను దాఖలు చేసింది. నీరవ్‌మోదీ, మెహుల్‌ ఛోక్సీ, నీరవ్‌ సోదరుడు నిషాల్‌లపై ఇంటర్‌పోల్‌ ద్వారా సీబీఐ ఫిబ్రవరి 15న డిఫ్యూజన్‌ నోటీస్‌ను జారీ చేసింది. ఈ నోటీసు ద్వారా నిందితుడు ఏ ప్రదేశంలో ఉన్నాడనే సమాచారాన్ని ఇంటర్‌పోల్‌ సభ్యదేశాలు పంచుకుంటాయి. నీరవ్‌మోదీ, అతని మామ మెహుల్‌ ఛోక్సీ పీఎన్‌బీని వేలకోట్లకు మోసగించి దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్‌ కుంభకోణానికి పాల్పడిన విషయం తెలిసిందే.