నీలిమ సెల్‌ఫోన్‌ ఆధారంగా విచారణ సాగుతోంది: సైబరాబాద్‌ డీసీపీ

హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నీలిమ మృతికి ముందు రాత్రి 9.36 వరకు విజువల్స్‌ లభించాయని సైబరాబాద్‌ డీసీపీ తెలియజేశారు.  నీలిమ అనుమానాస్పద మృతిపై పోలీసు అధికారులు ఈరోజు మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో నిర్వహంచారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అదునులోకి తీసుకోలేదని, ఆమె సెల్‌ఫోన్‌ ఆధారంగా విచారణ జరుగుతోందని, డీసీపీ తెలియజేశారు. ఒక నెంబరుకు 9.30 నిమిషాల సమయంలో ఫోన్‌ కాల్‌ వెళ్లిందని ఆ వ్యక్తిని గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. అయితే నీలిమ సెల్‌ఫోన్‌ స్క్రీస్‌ లాక్‌ అయివుందని, ఓపెన్‌ చేసేందుకు షోరూమ్‌కు పంపించామని ఆయన తెలిపారు. రాత్రి 9 గంటలకు నీలిమ 18-19 నెంబరు గల భవనంలోకి వెళ్లిందని డీసీపీ తెలియజేశారు. నీలిమ భవనంపై నుంచి పడిపోయిన తర్వాత సెక్యూరిటీ గార్డు రమేశ్‌ గమనించారని, కంపెనీ ఉద్యోగులు ముగ్గురు కలిసి నీలిమను అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారని ఆయన తెలిపారు. 10.37కి మొదటగా కంపెనీ సెక్యూరిటీ అధికారికి ఫోన్‌ వచ్చినట్లు చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌కు 11 గంటలకు సమాచారం వచ్చిందన్నారు. నీలిమ పడిపోయే సమయంలో ఒక చెప్పు ఏడో అంతస్తులో లభ్యమైందని, ఏడో అంతస్తునుంచి పడిపోయిందనడానికి పైపులపై మరకలు ఉన్నాయని డీసీపీ తెలియజేశారు. సమాచారం అలస్యమవడానికి కారణం సరైన  ఫోన్‌ నెంబర్లు అందుబాటులోకి రాకపోవడమేనని, నీలిమ బ్యాగ్‌లో దొరికిన చీటి ఆధారంగా చివరికి కుటుంబ సభ్యులకు  ఫోన్‌ చేశారని డీసీపీ అన్నారు. పోస్ట్‌మార్టమ్‌ని వీడియోతీసింది ప్రసారమాధ్యమాల్లో పేర్కొంటున్నట్లు వైద్యులు కాదని, పోలీసులేనని ఆయన తెలిపారు. పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టు ఇంకా తమకు అందలేదన్నారు. పోస్ట్‌మార్టమ్‌, మెడికల్‌ రిపోర్టులు వచ్చాక పూర్తి వివరాలు చెప్పగలుగుతామని డీసీపీ పేర్కొన్నారు.