నూతన వార్డ్ కమిటీ ఎన్నిక
ఎల్లారెడ్డి 12 అక్టోబర్ జనంసాక్షి (టౌన్) ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు లింగారెడ్డిపేట్ హరిజనవాడ నూతన వార్డు కమిటీ ఎన్నిక లో వార్డ్ కమిటీ అధ్యక్షులుగా భూమయ్యను, ఉపాధ్యక్షులుగా జీవన్, ప్రధాన కార్యదర్శిగా గంగారం, కోశాధికారిగా సాయిరాం లను గ్రామ ప్రజల సమక్షంలో ఎన్నుకున్నట్లు నూతన వార్డ్ కమిటీ అధ్యక్షులు భూమయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటుతో మా గ్రామాన్ని కళ్యాణి గ్రామం నుండి విడదీసి ఎల్లారెడ్డి మున్సిపల్ లో విలీనం చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు మా యొక్క వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. ఇటీవల పట్టణ ప్రగతి, స్వతంత్ర వజ్రోత్సవాల పేరుతో హడావిడి చేసి మున్సిపల్ లోని వివిధ వార్డుల్లో కొద్దో గొప్పో అభివృద్ధి చేశారేమో గాని మా కాలనీ వార్డులో కనీసం మురికి కాలువలు, చెట్ల పొదలు, గడ్డి కూడా శుభ్రం చేయించలేదని దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు ఆరోగ్యం పాలవుతున్నారని, మా యొక్క కాలనీకి అర కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలకు మా పిల్లలు వెళ్లే క్రమంలో కోతులు పిల్లలపై దాడి చేస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడంలేదని అన్నారు. ఇకపై మున్సిపల్ యంత్రాంగం మా కాలనీ దుస్థితులు పట్టించుకోకుంటే నూతన వార్డు కమిటీ ద్వారా మా కాలనీ ప్రజలంతా ఏకమై తిరుగుబాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.