నెత్తురోడుతున్న రాజీవ్ రహదారి
ఆందోళనలు చేసిన వారే అధికారంలో ఉన్నారు
అయినా కానరాని మార్పు
కరీంనగర్,సెప్టెంబర్15(జనంసాక్షి): రాజీవర్ రహదారి నిత్యం నెత్తురోడుతోంది. ఈ రహదారి వంకరలను సవరిస్తామన్న ప్రతిపాదనలు బుట్టదాఖలు అయ్యాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో దీనిపై తీవ్ర ఆందోళనలు సాగాయి. ఆనాటి నేతలు ఇప్పుడు అధికారంలో ఉన్నా పట్టించుకోవడం లేదు. ప్రధానంగా సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి హరీష్ రావు దీనిపై ఒక్క మాటా మాట్లాడడం లేదు.
వంద కిలోవిూటర్ల వేగం మించకుండా రాజీవ్ రహదారిపై వాహనాలు నడపాల్సి ఉంటుంది. కానీ మితివిూరిన వేగంతో వాహనాలు దూసుకెళుతుంటాయి. వేగాన్ని నియంత్రించేలా స్పీడ్ గన్‌లను ఏర్పాటు చేస్తామని అధికారులు మూడున్నర నెలల క్రితం ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. రహదారి చాలా చోట్ల మలుపులు ఉండటంతోనే సాధ్యం కావడం లేదన్న సమాధానమిస్తున్నారు. సిద్దిపేట జిల్లా పరిధిలో దాదాపు 90 కిలోవిూటర్ల మేర ఉన్న ఈ రహదారి కొన్ని చోట్ల మాత్రమే కిలోవిూటరు కంటే ఎక్కువ దూరం మలుపులు
లేకుండా ఉందని వివరించారు. గతంలో శాసనసభా సంఘం అధ్యయనంలోనూ కేవలం ఈ ఒక్క జిల్లా పరిధిలోనే 60 ప్రమాదకర మలుపులు ఉన్నట్లు తేలింది. వాటిని సరిచేసే అంశమై ఇప్పటికైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కనీసం మలుపులు లేని చోట్ల స్పీడ్ గన్‌లు ఏర్పాటు చేసి వాహనాల వేగానికి కళ్లెం వేస్తే ప్రమాదాల సంఖ్యతో పాటు తీవ్రత తగ్గే అవకాశముంది. ఇకపోతే నిత్యం నెత్తురోడుతున్న రహదార్లు చూసి, ఏటా దాదాపు లక్షన్నరమంది రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూస్తున్న తీరు గమనించి కఠిన చర్యలు అవసరమన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లును రాజ్యసభ ముందుంచింది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన గణాంకాలు చూస్తే భయాందోళనలు కలుగుతాయి. రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యలో ప్రపంచంలోనే మనది ద్వితీయ స్థానం. దేశంలోని అసహజ మరణాల్లో వీటి శాతం 44గా ఉంది. సగటున రోజుకు 17మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, గణాంకాలను విశ్లేషిస్తే అర్ధమవుతుంది. ప్రమాదాల విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం అంతా ఇంతా కాదు. ఉద్దేశపూర్వకంగా ప్రజా రవాణా వ్యవస్థ పీకనొక్కుతూ జనం సొంత వాహనాలపై ఆధారపడక తప్పని స్థితి కల్పిస్తున్నవి ప్రభుత్వాలే. తగినన్ని బస్సులు అందుబాటులో ఉంచకపోవటం, అవి కూడా సమయానికి రాక పోవడం వగైరా కారణాల వల్ల పనులపై బయటికెళ్లేవారు, ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థులు తప్ప నిసరిగా సొంత వాహనాలు సమకూర్చుకోవాల్సి వస్తోంది. మన రహదార్ల నిర్వహణ సక్రమంగా లేదని తెలిసినా, అవి భారీ సంఖ్యలో వాహనాలను భరించేంత ప్రామాణికమైనవి లేదా విశాలమై నవి కాదని తెలిసినా ప్రభుత్వాలు వాహనాల అమ్మకాలపై నియంత్రణ పెట్టడం లేదు. కాలం చెల్లిన వాహనాలు తిరుగుతున్నా, అవి కాలుష్యాన్ని వెదజల్లుతున్నా పట్టించుకునేవారుండరు. అయితే కేవలం భారీ జరిమా నాలు మాత్రమే సమస్యను చక్కదిద్దలేవు. రోడ్డు
ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సాయం చేయడానికి ప్రయత్నించినవారికి ఇకపై కేసుల బెడద ఉండదు. రహదార్ల భద్రత గురించి తరచు మాట్లాడే పాలకులు సవరణ బిల్లులో దానికంత ప్రాముఖ్యత ఇవ్వకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 50 కన్నా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రాంతాలను ‘బ్లాక్ స్పాట్’లు గుర్తించి అక్కడ దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెబుతున్నారు. మంచిదే. కానీ ఇంజనీరింగ్ లోటు పాట్లున్నట్టు రుజువైతే సంబంధిత అధికారులపై తీసుకునే చర్యలేమిటన్న ప్రతిపాదన లేదు. రాజీవ్ రహదారిపై సరకు రవాణా వాహనాల్లోనూ ప్రజలు ప్రయాణిస్తున్నారు. ఇతర వాహనాల్లోనూ పరిమితి కంటే ఎక్కువ సంఖ్యలో జనాలను కుక్కేస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో ప్రమాదానికి గురైన క్వాలిస్ వాహనంలో 17 మంది ఉన్నారు. శుక్రవారం పాములపర్తికి చెందిన గ్రామస్థులు… అంత్యక్రియల్లో పాల్గొనడానికి టాటా ఏస్ ట్రాలీలో ఏకంగా 24 మంది వరకు ప్రయాణించినట్లు స్థానికులు చెబుతున్నారు. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణిస్తున్నా.. నిబంధనలకు విరుద్ధంగా సరకు రవాణా వాహనాల్లో ఇష్టారీతిన వెళుతున్నా రవాణా శాఖ అధికారులు చూసీ చూడనట్లు ఉండిపోతున్నారు. దీంతో ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. వాహనదారులు, ప్రజల్లో అవగాహన కలిగించే దిశగా అడుగులు పడకపోవడం బాధాకరం. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.