నెహ్రూ సరిగ్గా ఆలోచించి ఉంటే దళితుల బతుకులు మారేవి

` కేవలం ఓటుబ్యాంకుగానే వాళ్లను వాడుకున్నారు
` ఆ పరిస్థితులు మార్చేందుకే దళితబంధు తీసుకొచ్చాం
` గతంలో రైతు బాగోగుల గురించి ఆలోచించే నాథుడే లేడు
` కాంగ్రెస్‌ నమ్ముకుంటే మళ్లీ దళారుల రాజ్యమే..
` ఒక్క ఛాన్స్‌ ఇస్తే పంటికంటకుండా మింగేస్తారు
` ప్రజల ఆలోచించి ఓటేస్తే ఐదేండ్లు మంచి భవిష్యత్‌
నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌
నిర్మల్‌ బ్యూరో/నిజామాబాద్‌ బ్యూరో/జగిత్యాల ప్రతినిధి (జనంసాక్షి):
దేశంలో దళితుల పరిస్థితి దారుణంగా ఉందని, కాంగ్రెస్‌ పార్టీ దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటుందని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఆనాడు నెహ్రూ సరిగ్గా ఆలోచించి ఉంటే దళితుల బతుకులు ఎప్పుడో బాగుపడేవని చెప్పారు. అణిచివేత, అంటరానితనం, వివక్ష తప్ప వారి జీవితాల్లో ఎలాంటి మార్పూ లేదని, అందుకే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితబంధు తెచ్చిందని వివరించారు. దఫాదఫాలుగా దళిత సమాజాన్ని ఉద్ధరించాలని ముందుకు పోతున్నట్టు తెలిపారు. నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించారు.
తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌ ఏమి చేసిందో కూడా ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటే నిర్మల్‌ జిల్లా వచ్చేది కాదన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ధరణి పోర్టల్‌ ఉంది కాబట్టే రైతుబంధు వస్తోందన్నారు. ధాన్యం డబ్బులు, బీమా డబ్బులు రైతులకు పడుతున్నాయన్నారు. తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే.. మళ్లా పైరవీకారులు పుట్టుకొస్తరు.. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు అవుతుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. పార్టీల చరిత్ర, నడవడి గురించి విూరు ఆలోచించాలని ప్రజలకు సూచించారు. బంగారు తెలంగాణ కోసం రాష్ట్రంలో వ్యవసాయ రంగం వృద్ధికి అనేక పథకాలు అందిస్తున్నామని, అందులో భాగంగానే రైతుబంధు ప్రవేశపెట్టామని సీఎం కేసీఆర్‌ వెల్లడిరచారు. రైతు రుణమాఫీ కొనసాగిస్తున్నామని, ఎన్నికల కోడ్‌ వల్ల కొందరికి అందించలేకపోయామని తెలిపారు. ఈసీ అనుమతిస్తే ఇప్పుడే రైతు రుణమాఫీ పూర్తిచేస్తామని చెప్పారు. లేదా  ఎన్నికలు ముగిసిన మర్నాడే ఇచ్చేస్తామని హామీనిచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఆలోచన చేయలేదని, కాంగ్రెస్‌ నమ్ముకుంటే మళ్లీ దళారుల పాలవుతామని అన్నారు.
కరెంట్‌ ఉత్పత్తిలో మనది మిగులు రాష్ట్రం
తెలంగాణ రాష్ట్రంలో కరెంట్‌ కొరత రానే రాదు.. మిగులు రాష్ట్రంగా కాబోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తేల్చిచెప్పారు. అలాగే తెలంగాణలో ఇస్తున్న 24 గంటల కరెంట్‌ ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. అధికారం దక్కిన కర్నాకటలో కూడా కాంగ్రెస్‌ ఇవ్వడం లేదని గుర్తించాలని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఓటు చాలా విలువైంది.. దాని ప్రభావం ఐదేండ్ల భవిష్యత్‌పై ఉంటది కాబట్టి జాగ్రత్తగా వాడాలన్నారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ అందుబాటులోకి వస్తే ఇంకో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ మనకు వస్తుంది. మిగులు రాష్ట్రంగా కాబోతున్నాం. కరెంటో కొరత రానేరాదు. ఎవరికి రాని, ఎవడు యేట్లే పడని, గంగల పడని, తెలంగాణకు మాత్రం ఆ కొరత రాదు. రానివ్వడు కేసీఆర్‌ ఎట్టి పరిస్థితుల్లో అని సీఎం తేల్చిచెప్పారు. 17 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్‌ ఇవ్వడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తున్నాం. దీని గురించి బీడీలు చుట్టే బిడ్డలు ఆలోచించాలని కోరారు. బీడీ కార్మికులకు రేపు ఐదు వేల పెన్షన్‌ రాబోతోందన్నారు. ఎమ్మెల్యేగా మరోసారి వేముల ప్రశాంత్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
ప్రధానికి ప్రైవేటు పిచ్చి పట్టింది..
కాంగ్రెస్‌ పాలనలో ఉన్న ధర్మపురికి ఇప్పుడున్న ధర్మపురికి తేడా గమనించాలని సీఎం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కొత్త రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. కొప్పుల ఈశ్వర్‌ 70 నుంచి 80 వేల మెజార్టీతో గెలిపించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రైవేట్‌ పిచ్చి పట్టుకుందన్నారు. రైతుల మోటార్లకు విూటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలని ప్రధాని మోడీ నాతో చెప్పారు అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిన ప్రజల్లో రావలసిన పరినితి  రాలేదని ఎన్నికలు వస్తాయి పోతాయి ప్రతి ఎన్నికల్లో ప్రజలే గెలవాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే దళారుల రాజ్యం వచ్చినట్టే అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే దసరా కోసం పంచదార ఇవ్వాల్సి వస్తుందన్నారు. గతంలో ట్రాన్స్‌ఫార్మర్లు కరెంటు మోటర్లు కాలే తిప్పలు ఇప్పుడు లేదన్నారు. కొప్పులను గెలిపిస్తే ధర్మపురికి దళితబంధు ఒకేసారి మంజూరు చేస్తామన్నారు. గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.