నేటినుంచి సంచార భూసార పరీక్ష కేంద్రం ద్వారా పరీక్షలు

వరంగల్‌,మార్చి31(జ‌నంసాక్షి): జిల్లాలో ఏప్రిల్‌ ఒకటి నుంచి సంచార భూసార పరీక్ష కేంద్రం ద్వారా రైతుల పొలాల్లో మట్టి పరీక్షలు నిర్వహించనున్నారు. నేరుగా పొలాల వద్దకే వెళ్లి  పరీక్షలను నిర్వహిస్తారు. భూపలోపాలను తెలియచేయమడంతో పాటు ఎరువులు, పంటలను వేసే విధానాలను తెలియచేస్తారు. ఈ మేరకు జిల్లా భూసార పరీక్ష కేంద్రం అధికారులు ప్రణాళికను రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా రూ.50 లక్షలతో రూపొందించిన సంచార భూసార పరీక్ష కేంద్రం వాహనాన్ని జిల్లాకు కేటాయించింది. ఈ సంచార వాహనంలో ప్రస్తుతం జిల్లా భూసారపరీక్ష కేంద్రంలో పని చేస్తున్న వ్యవసాయాధికారులు ఇందుకు  డిప్యూటేషన్‌పై నియమించారు. ఈ సంచార వాహనంలో శాశ్వతంగా వ్యవసాయాధికారులు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ సంచార వాహనం వరంగల్‌ జిల్లాతోపాటు ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో కూడా పనిచేయనుంది. వరంగల్‌ జిల్లాలో ఏప్రిల్‌ ఒకటి నుంచి సంచార మట్టి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఎప్రిల్‌ 1, 2 తేదీలలో లింగాలఘనపురం మండలంలో, 4, 5 తేదీల్లో జనగామ మండలంలో, 6,7 తేదీల్లో బచ్చన్నపేట మండలంలో, 11 నుంచి 13 వరకు చేర్యాల మండలంలో, 16 నుంచి 19 వరకు నర్మెట్ట మండలంలో, 20 నుంచి 22 తేదీ వరకు మద్దూరు మండలంలో రైతుల పొలాల్లో సేకరించిన మట్టి పరీక్షలను చేయనున్నట్లు సంచార భూసార పరీక్ష కేంద్ర వ్యవసాయాధికారి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. ప్రతి రోజు ఈ వాహనంలో సుమారు 100 మట్టి నమూనాలను భూసార పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జిల్లాలో 15 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా 1500 మట్టి నమూనాల పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మరో 15 రోజులు ఖమ్మం, మరో 15 రోజులు కరీంనగర్‌ జిల్లాలో మట్టి పరీక్షలు చేయనున్నారు. ఈ వాహనంలో శాశ్వత వ్యవసాయాధికారులు, సిబ్బందిని నియమించే వరకు ఆయా జిల్లాల పరిధిలోని అధికారులను డిప్యూటేషన్‌పై నియమించనున్నారు. ఇప్పటికే ముందస్తుగా రైతుల పొలాలనుంచి ఆయా మండలాల వ్యవసాయాధికారులు మట్టిని సేకరించి వ్యవసాయశాఖ కార్యాలయాల్లో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. గతంలో జనగామ డివిజన్‌ ప్రాంతంలోని మట్టిని భూసార పరీక్షల నిమిత్తం రంగారెడ్డి జిల్లాకు పంపించే వారని తెలిపారు. ప్రస్తుతం సంచార భూసార పరీక్ష కేంద్రం వాహనంలోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలను అందించనున్నట్లు చెప్పారు.