నేడు ఎర్రంనాయుడు అంత్యక్రియలు

ప్రధాని, సోనియా సంతాపం
బయల్దేరిన చంద్రబాబు
హైదరాబాద్‌, న్యూఢిల్లీ, నవంబర్‌ 2 : తెలుగుదేశం పార్టీ శ్రేణుల, అభిమానుల, సన్నిహితుల విజ్ఞప్తి మేరకు కింజరపు ఎర్రంన్నాయుడు పార్దీవదేహానికి అంత్యక్రియలు శనివారం ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు కొనసాగ నున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూను ఆదేశించారు.
ప్రధాని, సోనియా సంతాపం
టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి కె.ఎర్రంన్నాయుడు మృతి పట్ల యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ సంతాపం తెలిపారు. ఎర్రంన్నాయుడు మృతి దేశానికి తీరని లోటు అని అన్నారు. కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ కూడా ఎర్రంనాయుడు కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, డి.పురందరేశ్వరి శుక్రవారంనాడు సంతాపం తెలిపారు.ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాష్‌ కారంత్‌, సీతారాం ఏచూరి కూడా సంతాపం తెలిపారు. తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య సానుభూతి వ్యక్తం చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రి గులాంనబి ఆజాద్‌ మాట్లాడుతూ గొప్ప నేతను కోల్పోయామన్నారు. ఆయన సేవలు జాతి మరువదన్నారు. అలాగే జర్నలిస్టు సంఘాలు కూడా సంతాపం తెలిపాయి. ఇదిలా ఉండగా ఎర్రంన్నాయుడు పార్దీవదేహానికి శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి శ్రద్దాంజలి ఘటించారు. అలాగే బిజెపి జాతీయ నాయకుడు ఎం.వెంకయ్య నాయుడు, ఆ పార్టీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ కూడా శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు.

ప్రత్యేక విమానంలో చంద్రబాబు..
మహబూబ్‌నగర్‌ జిల్లా పెదచింతకుంట నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో విశాఖపట్నంకు బయల్దేరారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్‌ ఉన్నారు. ఇదిలా ఉండగా ఎర్రంన్నాయుడు మృతి పట్ల సంతాపం తెలిపేందుకు వెళ్లే టీడీపీ నేతల కోసం ఎంపి సిఎం రమేష్‌ విమానాశ్రయ అధికారులతో మాట్లాడి ఒక ప్రత్యేక విమానాన్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉంచినట్టు సమాచారం.